న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా, ఆర్థిక, నిరుద్యోగ, పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నవేళ భారత్ ఓ ఆశాకిరణంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలో అన్ని దేశాలు ఆర్థిక అనిశ్చితితో ఇబ్బంది పడుతుంటే.. మనం మాత్రం భారత్ దశాబ్దిపై చర్చలు జరిపామని గుర్తుచేశారు. దేశం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. సోమవారం ఎన్డీటీవీ వరల్డ్ సమిట్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. మూడో టర్మ్‌లో తమ సర్కారు 125 రోజులు పూర్తిచేసుకున్నదని, ఈ తక్కువ కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. పేదలకు 3 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. రూ. 9 లక్షల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.
15 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, 8 కొత్త ఎయిర్‌పోర్టుల పని ప్రారంభమైందని తెలిపారు. యువతకు రూ.2లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని, 70 ఏండ్లకు పైబడిన వారి కోసం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ‘5 లక్ష ఇండ్లల్లో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. రైతుల ఖాతాల్లో రూ.21వేల కోట్లు బదిలీ చేశాం. 12 కొత్త ఇండస్ట్రియల్ డాట్స్‌ను ఆమోదించాం. స్టాక్ మార్కెట్ సూచీల్లో దాదాపు 7% వృద్ధి రికార్డైంది. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్ డాలర్లను దాటేసింది’ అని మోదీ వివరించారు. ఇదంతా 125 రోజుల్లోనే జరిగిందన్నారు.
ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది
తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే దేశంలో 3 ప్రపంచ స్థాయి సమావేశాలు జరిగాయని మోదీ పేర్కొన్నారు. టెలికామ్ డిజిటల్ ఫ్యూచర్‌పై అంతర్జాతీయ అసెంబ్లీ జరిగిందని, గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్, గ్లోబల్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్‌పై సదస్సు నిర్వహించినట్టు చెప్పారు. ఈ కాలంలోనే రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధిరేటును గణనీయంగా పెంచాయని చెప్పారు. భారత్‌లో యువశక్తి అధికంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, 2047లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని అందరి మదిలో నాటుకుపోయిందన్నారు. మరో 25 ఏండ్లలో ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుందని తెలిపారు.
ఆ శక్తి భారత్‌కు ఉంది: డేవిడ్ కామెరూన్
రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్‌కు ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. ఎన్డీటీవీ వరల్డ్ సమిట్‌లో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకోకుండా చూడాలన్నారు.
ఏఐ అంటే ఆస్పిరేషనల్ ఇండియా
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగమని, ప్రపంచ భవిష్యత్తు అంతా దీనితోనూ ముడిపడి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ అంటే మిగతా ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్మాత్రమేనని, కానీ భారత్‌కు మాత్రం ‘ఆస్పిరేషన్ ఇండియా’ కూడా అని పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్ ఏఐ మిషన్‌ను ప్రారంభించిందని చెప్పారు. ప్రతి రంగంలో ఏఐ వినియోగాన్ని పెంచామని తెలిపారు. అందరి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
కరోనా టైంలో మందులు అమ్మి మిలియన్ డాలర్లు సంపాదించే అవకాశమున్నా అలా చేయలేదని, అది ఇండియన్ కల్చర్ కాదని అన్నారు. భారత్ ఎదుగుతుంటే ప్రపంచం అసూయ చెందడం లేదని, ఎందుకంటే దేశ ఎదుగుదల ప్రపంచానికి ప్రయోజనకరంగా మారుతున్నదని తెలిపారు. డిజిటల్ ఇన్నోవేషన్, ప్రజాస్వామ్యం కలగలసి ఎలా ఉంటుందో భారత్ ప్రపంచానికి చూపించిందని అన్నారు. 21వ శతాబ్దంలో స్థిరత్వం, వృద్ధి అనేది ముఖ్యమైనవని, ఈ టర్మ్‌లో తమ సర్కారు వాటిపైనే దృష్టిపెట్టిందని చెప్పారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయాన్ని అందించి తమ సర్కారు స్థిరత్వంపై నమ్మకం ఉన్నదని అక్కడి ప్రజలు నిరూపించారని చెప్పారు.
బ్రిక్స్‌లో జిన్‌పింగ్‌తో మోదీ భేటీ ఉంటుందా?
రష్యాలోని కజన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వీరిమధ్య భేటీ ఉంటుందా? అనే ప్రశ్నలను మీడియా లేవనెత్తగా చైనా సూటిగా జవాబివ్వలేదు. దీనికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా తాము పోస్ట్ చేస్తామ ని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జైన్ తెలిపారు.