నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 2.50 లక్షల వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వడాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా విజృంభిస్తుండటంతో.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తుండగా.. మరికొన్ని వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రివ్యూ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితిని తెలుసుకోనున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో చర్చించనున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.