ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల (నవంబర్ 12న)లో తెలంగాణ పర్యటనకు రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. కాగా.. గతేడాది మార్చి 22న ఆర్ఎఫ్‌సీఎల్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాక సందర్భంగా.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్, కేంద్ర ఎరువులు, రసాయనశాఖ కార్యదర్శితో పాటు పోలీసులు ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను అరుణ్ సింఘాల్ పరిశీలించారు. అనంతరం ప్రధాని పర్యటనపై.. సీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో సింఘాల్ సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా.. మోడీ పర్యటనకు.. సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుసార్లు తెలంగాణకు మోడీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ పాల్గొనలేదు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పరిస్థితులు వాడీవేడీగా ఉన్నాయి. మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నేపథ్యంలో.. మోడీ పర్యటన ఆసక్తికరంగా మారింది.