ఒడ్డున పడ్డ చేపలా కాంగ్రెస్ పరిస్థితి: ప్రధాని మోడీ సెటైర్లు

ఒడ్డున పడ్డ చేపలా కాంగ్రెస్ పరిస్థితి: ప్రధాని మోడీ సెటైర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. హర్యానా, జమ్మూలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్యానా ప్రజలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాలను ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. తద్వారా అసలైన దేశభక్తులమని రుజువు చేశారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ వికాసానికి అడ్డువచ్చేవారిని హర్యానా ప్రజలు పక్కకు తప్పించారని అన్నారు. 

హర్యానా రైతులు తాము బీజేపీ వెంటే ఉన్నామని మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మళ్లీ మళ్లీ మాకు అవకాశం కల్పిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వరుసగా రెండోసారి ఎక్కడ అధికారంలోకి రావడం లేదని సెటైర్ వేశారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‎ను ప్రజలు చాలా దూరంగా ఉంచారు.. మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‎కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు కేవలం వారసత్వ, కుటుంబ రాజకీయాలపై ఆధారపడ్డారని విమర్శించారు. 

ALSO READ | అసలైన దేశభక్తులని నిరూపించుకున్నారు: ప్రధాని మోడీ హాట్ కామెంట్స్

కాంగ్రెస్ పరిస్థితి నీటిలోనుండి ఒడ్డునపడ్డ చేపలా తయారైందని చమత్కరించారు. ఎస్సీ, ఎస్టీలు, వెనకబడిన వర్గాలను మేం ఎప్పుడూ మరిచిపోం.. కానీ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా పేద ప్రజలను వంచించిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాలను ఎదగనివ్వదని.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పేదరికం ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. ఎస్సీలు, వెనుకబడినవర్గాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఈ  సందర్భంగా హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి ఈసీతో పాటు పలు రాజ్యాంగ సంస్థలను అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు.