
వారణాసి(యూపీ): దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికార కాంక్షతో వారి కుటుంబాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కానీ తాము అందుకు భిన్నంగా సమ్మిళిత వృద్ధి అనే థీమ్‌తో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘పరివార్‌కా సాథ్.. పరివార్‌కా వికాస్’ (కుటుంబంతో కలిసి.. కుటుంబం అభివృద్ధి) ప్రతిపక్ష నినాదమైతే.. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ (అందరితో కలిసి అందరి అభివృద్ధి) తమ స్లోగన్అని పేర్కొన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అధికార దాహంతో పగలూ రాత్రి రాజకీయ క్రీడలో మునిగి తేలినవారు వారి కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే పరితపిస్తున్నారని ప్రతిపక్షంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
కాశీ ఎప్పటికీ తనదేనన్న మోదీ
మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా.. ఆయనకు మోదీ నివాళి అర్పించారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. భారత్ అభివృద్ధి, వారసత్వంతో కలిపి ముందుకువెళ్తున్నదని చెప్పారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు అధికారులు అనుమతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పా రు. తన నియోజకవర్గమైన కాశీ ఎప్పటికీ తనదేనని.. తాను కాశీకి చెందినవాడినని మోదీ పేర్కొన్నారు.
గ్యాంగ్‌రేప్ నిందితులను కఠినంగా శిక్షించండి
వారణాసిలో 19 ఏండ్ల బాలిక గ్యాంగ్ రేప్‌పై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఈ ఘటనపై ఆరా తీశారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్‌తో సమావేశమై, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ఘటనలో 23 మంది నిందితులు ఉన్నారని, వీరిలో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.