
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుందని ప్రధాని మోడీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం (ఏప్రిల్ 27) మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయ పౌరుడిని తీవ్రంగా బాధించిందని, దాడి ఘటనను దేశమంతా ఖండించిందన్నారు.
పలు దేశాధినేతలు సైతం పహల్గాం ఉగ్రదాడిని ఖండించారని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన మోడీ.. ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ దాడి కాశ్మీర్ సాధిస్తోన్న అద్భుతమైన పురోగతిని దెబ్బతీసేందుకు చేసిన తీవ్ర ప్రయత్నమని పేర్కొన్నారు.
‘‘ఇటీవలి సంవత్సరాలలో కాశ్మీర్ అపూర్వమైన వృద్ధిని సాధించింది. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది నచ్చకే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు. టెర్రరిస్టులు కాశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలనుకుంటున్నారు’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపారు. దీంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు.