గాంధీనగర్: భారత భూభాగంలో ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని.. సరిహద్దుల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలో గుజరాత్లో పర్యటించారు. కచ్ఛ్ తీరంలోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. జవాన్లకు స్వీట్లు తినిపించి మోడీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు.
ప్రత్యర్థుల నుండి ఎదురయ్యే సవాళ్లు, 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన సైన్యాన్ని, భద్రతా దళాలను ఆధునిక వనరులతో పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో భారత్ ఒకటి అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని.. ఇందులో దేశ సైనికుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. సరిహద్దు పర్యాటకం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని.. కచ్‌కు ఇందులో అపారమైన సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. కాగా, 2021లో తూర్పు లడాఖ్‌లోని గాల్వాన్‌లోయ వద్ద భారత, చైనా జవాన్లకు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ALSO READ | దేశ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు
సరిహద్దు వెంబడి చైనా భూ అక్రమణలకు పాల్పడటంతో భారత సైన్యం అడ్డుకుని ధీటుగా జవాబిచ్చింది. ఈ పరిణామంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు.. ఎల్ఏసీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఇటీవల చైనా, భారత్ అధికారులు చర్చలు జరిపి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తూర్పు లడాఖ్‌లో సైనిక బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. ఒప్పందంలో భాగంగా ఎల్ఏసీ వెంబడి ఇరు దేశాల సైనికుల ఉపసంహరణ చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో సరిహద్దులో ఇంచు భూమి కూడా వదులుకోబోమని కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.