న్యూఢిల్లీ: మహారాష్ట్రలో సత్యం, న్యాయం గెలిచిందని.. క్షేతస్థాయిలో కష్టపడ్డ కార్యకర్తల కృషి ఫలించిందని ప్రధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహయుతి కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసగించారు. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని.. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని.. మహారాష్ట్రలో రికార్డ్ విజయం సాధించామని.. మరాఠా గడ్డ ఇలాంటి అద్భుత విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఆనందం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీకి పట్టాం కట్టారని.. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌కు అభినందనలు తెలిపారు. విభజిత రాజకీయాలు, కుట్రలు, అవినీతికి పాల్పడేవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. జార్ఖండ్‌లో ఇంకా కష్టపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీ.
వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందని.. బై పోల్స్‌లో విజయం ద్వారా బీజేపీ బలం మరింత పెరిగిందన్నారు. మహారాష్ట్ర దేశాభివృద్ధికి ఇంజిన్ లాంటిందని.. అలాంటి మహారాష్ట్ర కోసం, మరాఠీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఏనాడు కృషి చేయలేదని ఫైర్ అయ్యారు. మరాఠాల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం మరాఠా భాషకు ప్రాచీన హోదా కల్పించిందని గుర్తు చేశారు మోడీ.
దేశ ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని.. విజభన రాజకీయాలు, అవినీతి, కుంభకోణాలు చేసే వారిని కాదని ఇండియాపై ధ్వజమెత్తారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గానూ.. ఏకంగా 234 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 145 సీట్ల మేజిక్ ఫిగర్ సునాయసంగా దాటి.. డబుల్ సెంచరీ కొట్టింది.