ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు తెలంగాణలో పర్యటించారు. రాష్ర్టంలో ప్రధాని మోదీ అధికారిక పర్యటనలు తెలంగాణాతోపాటు భారతదేశ రాజకీయాలపై కూడా ప్రభావాన్ని చూపాయి. 2014 నుంచి నరేంద్ర మోదీ తెలంగాణా ప్రజలకు అత్యంత సుపరిచితుడిగా మారారు. తెలంగాణలో ప్రధానంగా మూడు పార్టీలే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడనున్నాయి.
2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానంలోనే గెలిచింది. బీజేపీకి ఆ ఎన్నికల్లో అత్యల్పంగా ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా పుంజుకున్న బీజేపీకి నాలుగు పార్లమెంటు స్థానాలు, 20శాతం ఓట్లు దక్కాయి. 2019 నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గణనీయంగా పుంజుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, బీజేపీ ఏమేరకు బలపడిందనేది ప్రశ్నార్థకంగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో చేసిన సంచలన ప్రకటనలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో చేరాలని అనుకున్నారని, కేసీఆర్ తన స్థానంలో ఆయన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారని, దీనికి తన ఆశీస్సులు కోరుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
అందుకు నేను అంగీకరించలేదని, ఇదేమైనా రాజరికమా అని ప్రశ్నించానని చెప్పారు. మోదీ చేసిన ఆ వ్యాఖ్యలు తెలంగాణలోని రాజకీయవర్గాల్లో పెను సంచలనం చెలరేగింది. కేసీఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ రహస్య భాగస్వాములు అని మోదీ అనడం కూడా కలకలం రేపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు, గాంధీలు ఇతర రాజకీయ నాయకులకు సొంత కుటుంబాలు ఉన్నాయని, కానీ తనకు మాత్రం తెలంగాణ ప్రజలు మొత్తం కుటుంబ సభ్యులే అని ప్రధాని మోదీ అన్నారు. మోదీ తన స్పీచ్‌లో కులగణన అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తారు. ప్రతిపక్ష పార్టీలు మెజారిటీ హిందువులను విభజించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు.
తాను ఒకే కులాన్ని చూశానని, అదే పేదల కులం అని మోదీ అన్నారు. 2026లో పార్లమెంటు సీట్లను కేటాయించడానికి జనాభా సంఖ్య మాత్రమే ప్రామాణికం అయితే, దక్షిణ భారతదేశం చాలా సీట్లను కోల్పోతుంది. దక్షిణాదికి కాంగ్రెస్ ఇంతకాలం అన్యాయం చేయాలనుకున్నదా అని ప్రశ్నించారు.
‘తామెంతో మాకంతే’ అనే సూత్రం తెచ్చిన కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దక్షిణాదికి అన్యాయం చేయాలనుకుంటున్నాయా? అని ఆలోచింపజేసే ప్రశ్నను మోదీ చర్చకు తెచ్చారు.
ALSO READ : గద్వాల సర్కార్ దవాఖానలో టెస్టులు చేస్తలేరు!
ఓబీసీల్లో, ఎంబీసీలే ఎక్కువ
‘అధికార భాగస్వామ్యం సంఖ్యలపై మాత్రమే ఆధారపడి ఉండదు, పార్లమెంటు స్థానాలు, డీలిమిటేషన్ యొక్క క్లిష్టమైన సమస్యను ‘కుల గణన’లోకి తీసుకువస్తానని మోదీ అన్నారు. ఓబీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను విడుదల చేయవచ్చు. ఇది సంచలన నివేదికగా మారే అవకాశం ఉంది. భారతదేశంలోని ఓబీసీల్లో 1600 కంటే ఎక్కువ ఉప కులాలను జాబితా సూచిస్తుంది. ఒక ఓబీసీ కులానికి కాకుండా వివిధ వర్గాలకు వివిధ రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆధారపడి ఓబీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలని కమిషన్ సిఫారసు చేయవచ్చు.
ఇదే జరిగితే ఆధిపత్య ఓబీసీలు నష్టపోతారు. బీహార్ రాష్ర్టంలో యాదవులు మొత్తం జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్నారు. అయితే, వారికి 25శాతం మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆధిపత్య ఓబీసీలు కుల గణనను డిమాండ్ చేస్తున్నప్పటికీ రోహిణి కమిషన్ నివేదిక విడుదలైన తర్వాత పరిస్థితిలో మార్పురావచ్చు.
ఆధిపత్య ఓబీసీలు తమ అధికారాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇతర ఎంబీసీలు ప్రత్యేక ‘కోటాలో కోటా’ డిమాండ్ చేస్తాయి. కాగా, దేశంలో ఎన్నికైన అన్ని పదవులను దాదాపు ఎనిమిది ఆధిపత్య వెనుకబడిన కులాలు మాత్రమే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఎంబీసీల న్యాయం కోసం మోదీ యత్నం
200 సంవత్సరాల క్రితం, గొప్ప ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలిన్ ‘మీ శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు అతడికి ఎటువంటి అంతరాయం కలిగించవద్దు’ అని చెప్పాడు. మన ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ తప్పులపై రోజూ దాడి చేస్తూనే ఉంటాయి. దీంతో మోదీ తనను తాను సరిదిద్దుకుంటారు. ప్రధాని మోదీ మహిళా బిల్లును ఆమోదింపజేశారు. తెలంగాణకు పసుపు బోర్డు, జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు.
ప్రతిపక్షాలు మౌనంగా ఉండి ఉంటే, మోదీ ఈ విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు విస్మరించేవారు. ప్రాచీన గ్రీకులు మరొక సామెతను కలిగి ఉన్నారు. ‘మీరు దేని కోసం ప్రార్థించాలో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..దేవతలు మీ కోరికను తీర్చగలరు’ అనేది ఆ సామెత. ప్రతిపక్షాలు కుల గణనను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతిగా ఓబీసీల వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను మోదీ అమలు చేయవచ్చు. రోహిణి నివేదికను అమలు చేస్తే, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులు పూర్తిగా నష్టపోతారు. అతిగా మాట్లాడటం లేదా దుర్భాషలాడడం కొన్నిసార్లు విషపూరిత ఫలితాలను ఇస్తుంది.
ఇటీవల జరిగిన మాటల దాడులు, దూషణలు ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తేజపరిచాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఎలాంటి నష్టం వాటిల్లదని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన గొప్ప స్పష్టతను తెచ్చిపెట్టింది. మోదీ ఓబీసీల వర్గీకరణను కూడా అమలు చేయవచ్చు, అంటే కొన్ని ప్రాంతీయ రాజవంశాల పాలన ముగియనుంది. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందా, లేదా అనేది ప్రశ్న కాదు. కానీ, ఖచ్చితంగా తెలంగాణ మోదీని ‘తెలంగాణ కుటుంబ సభ్యుడి’గా పరిగణిస్తుంది.
దక్షిణాదికి అన్యాయం జరగదు
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదని ప్రధాని సూచించారు. కాంగ్రెస్‌పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా వివాదాలను రేకెత్తిస్తోంది. గత కొన్ని వారాలుగా దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ధోరణితో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాయి. బీజేపీ రహస్యంగా 2026లో డిలిమిటేషన్ ప్రక్రియని ఉపయోగించుకుని హిందీ ప్రధాన రాష్ట్రాలకు ఎక్కువ పార్లమెంటు స్థానాలను ఇవ్వనున్నట్లు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాయి.
దీనిపై మోదీ మాట్లాడుతూ..ఉత్తర భారతదేశంలో ఎక్కువ జనాభా, ఎక్కువ పార్లమెంటు స్థానాలు వస్తాయి. కానీ ఇంతకాలం కాంగ్రెస్దక్షిణ భారతాన్ని మోసం చేసిందని ఆరోపించారు. అధికారం కోసం హిందూ మెజారిటీని విభజించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని మోదీ అన్నారు.
పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ
2014 నుంచి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతున్న సహాయం, జాతీయ రహదారులు, రోడ్లు, మౌలిక సదుపాయాలను మోదీ ప్రస్తావించడం రాష్ట్ర ప్రజలను నిశ్శబ్దంగా ఆకట్టుకుంది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజల ప్రధాన డిమాండ్. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఇవ్వడంలేదని గత నాలుగేండ్లుగా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మాటల దాడి చేస్తున్నాయి.
ఈనేపథ్యంలో నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించి బీఆర్ఎస్కు చెక్‌పెట్టారు. ఆ పార్టీ నేతల నోరు మూయించారు. ములుగులో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కచ్చితంగా బీజేపీకి తెలంగాణ ప్రజల గౌరవాన్ని, మన్ననలను అందిస్తుంది.
- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్