న్యూఢిల్లీ: హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడోసారి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ హ్యాట్రిక్ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోనూ బీజేపీ సత్తా చాటింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగిన కమలం పార్టీ.. జమ్మూలో గతం కంటే మెరుగైన ఫలితాలు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో కాషాయ పార్టీ అగ్రనేత, ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా హర్యానా, జమ్మూ ఎన్నికల ఫలితాలపై మోడీ రియాక్ట్ అయ్యారు.
‘‘హర్యానాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. హర్యానాలో మరోసారి బీజేపీకి పట్టంకట్టిన ప్రజలకు నా సెల్యూట్. అభివృద్ధి, సుపరిపాలన హర్యానాలో విజయం సాధించాయి. హర్యానా ప్రజల ఆశయాలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పనితీరు పట్ల గర్వపడుతున్నాం. జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో విజయం సాధించిన ఎన్సీకి అభినందనలు’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.