
ఢిల్లీ: దళితులు, వెనుకబడినవర్గాలు, గిరిజనుల రిజర్వేషన్లను తొలగించేందుకు ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను అవమానించేలా ప్రతిపక్షాల చర్యలు ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను పరిరక్షించేందుకు తాను నిబద్ధతో ఉన్నానని ప్రధాని నొక్కి చెప్పారు.
చివర దశ ఎన్నికలలో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ.. అవినీతిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ పీహెచ్ డీ చేసిందని ఎద్దేవా చేశారు. పంజాబ్ లో కూడా ఆప్ ప్రభుత్వం పరిశ్రమలను, వ్యవసాయాన్ని నాశనం చేసిందన్నారు.పేదల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.
ఈ విషయంలో గురు రవిదాస్ తమకు స్పూర్తి అని మోదీ చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. వారి కుట్రను తాను బయటపెట్టానని.. దీంతో తనపై వారంతా తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ జతకట్టి.. ఆ పార్టీ నుంచి అవినీతి నేర్చుకుందని విమర్శించారు. ఆప్ ప్రభుత్వాలు డ్రగ్స్‌ను సంపాదన మార్గంగా మార్చుకున్నారని ఆరోపించారు.