కనీసం వందేండ్ల దాకా కాంగ్రెస్‌‌కు పవర్ ఇవ్వొద్దు : మోదీ

కనీసం వందేండ్ల దాకా కాంగ్రెస్‌‌కు పవర్ ఇవ్వొద్దు : మోదీ
  • కనీసం వందేండ్ల దాకా కాంగ్రెస్‌‌కు పవర్ ఇవ్వొద్దు
  • దేశ అభివృద్ధిని రివర్స్‌‌ గేర్‌‌‌‌లో వెనక్కి తీసుకెళ్లడంలో ఆ పార్టీ ఎక్స్‌‌పర్ట్: మోదీ
  • మధ్యప్రదేశ్‌‌లోని ఛత్తరపూర్, సత్నాలో ప్రధాని కామెంట్స్

ఛత్తర్‌‌‌‌పూర్/సత్నా :  కాంగ్రెస్ పార్టీకి కనీసం వందేండ్లపాటు అధికారం ఇవ్వొద్దని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశ అభివృద్ధిని రివర్స్‌‌ గేర్‌‌‌‌లో వెనక్కి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఎక్స్‌‌పర్ట్ అని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌‌లోని ఛత్తరపూర్, సత్నాలో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ట్రాప్‌‌లో పడొద్దు. రివర్స్‌‌ గేర్‌‌‌‌లో వెహికల్ వెనక్కి ఎలా వెళ్తుందో.. కాంగ్రెస్‌‌ కూడా అలానే రివర్స్‌‌ గేర్‌‌‌‌ వేయడంలో ఎక్స్‌‌పర్ట్‌‌. మధ్యప్రదేశ్‌‌లో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుందేల్‌‌ఖండ్‌‌ నీటి కష్టాలను తొలగించేందుకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌‌కు కనీసం వందేండ్లు అధికారం ఇవ్వొద్దు. అప్పుడైనా ఆ పార్టీ మారుతుందేమో” అని చెప్పారు. కాంగ్రెస్‌‌కు సొంత ప్రయోజనాలే ముఖ్యమని, దేశం కాదని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ నేతలు సిల్వర్ స్పూన్‌‌తో పుట్టారని, పేదరికంపై ఫన్ చేయడం వారికి అడ్వెంచర్ టూరిజం లాంటిదని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌‌కు.. దేశం మొత్తం ఢిల్లీతో మొదలై,  ఢిల్లీతోనే ముగుస్తుందని ఎద్దేవా చేశారు.

అవినీతి కాంగ్రెస్‌‌ను దూరం పెట్టండి

అవినీతి కాంగ్రెస్‌‌ను అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలను ప్రధాని కోరారు. తమ ప్రభుత్వం పేదల కోసం నాలుగు కోట్ల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చిందని, కానీ తన కోసం ఒక్కటి కూడా కట్టించుకోలేదని చెప్పారు. ‘‘బీజేపీ మరోసారి మధ్యప్రదేశ్‌‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మీ ఓటు సాయం చేస్తుంది. ఢిల్లీలో మోదీని బలోపేతం చేస్తుంది. ఇదే సమయంలో ఎంపీలో కాంగ్రెస్‌‌కు అధికారం దక్కకుండా ఆ పార్టీని వంద మైళ్ల అవతల ఉంచుతుంది. అంటే ఒక్క ఓటుతో మూడు అద్భుతాలు. ఇది త్రిశక్తి లాంటిది” అని చెప్పారు. దేశంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను రికార్డుల నుంచి తొలగించామని తెలిపారు. ఈ నకిలీ లబ్ధిదారులను కాంగ్రెస్ సృష్టించిందని ఆరోపించారు. గతంలో పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నాశనం చేసిందని, ఇప్పుడు ప్రతి పేద పౌరుడు తన హక్కు పొందుతున్నాడని చెప్పారు. పదేండ్లలో 33 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లో వేశామని, ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదని తెలిపారు.