కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటాం : నరేంద్ర మోదీ

  • ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీ
  • పసుపు పంటకు ప్రాధాన్యం

నిర్మల్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిపాలనలో సర్వనాశనమైన నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమను ఆదుకొని పూర్వ వైభవం కల్పిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. నిర్మల్​లో జరిగిన సకల జనుల సంకల్ప సభలో ఆయన ప్రత్యేకంగా నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ అంశాన్ని ప్రస్తావించారు. కొయ్య బొమ్మల పరిశ్రమ పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేకిన్ ఇండియాకు అత్యంత గౌరవం ఇస్తోందన్నారు. 

ఇప్పటికే నిర్మల్ కొయ్య బొమ్మల ఎగుమతులను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో పండించే పసుపు పంటకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిజామాబాద్​లో ఏర్పాటు చేసే నేషనల్ టర్మరిక్ బోర్డు ద్వారా నిర్మల్​లో సాగయ్యే పసుపు పంటకు మేలు జరుగుతుందన్నారు. ఆర్మూర్, నిర్మల్ పసుపుకు జియో టాగ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న తెలుగు పదాలు

తనకు కుమ్రం భీం, రాంజీ గోండ్ లాంటి మహనీయులు ప్రేరణగా నిలుస్తున్నారని మోదీ తెలిపారు. మోదీ చాలాసార్లు తెలుగులో మాట్లాడుతూ సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘నా కుటుంబసభ్యులారా’ అంటూ ప్రతిసారి పేర్కొనడంతో నజం జేజేలు పలికారు. సభకు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నిర్మల్ పట్టణమంతా జన సంద్రంగా మారింది. సభా ప్రాంగణం నిండిపోవడంతో అనేక మంది రోడ్లపైనే ఉండి పోవాల్సి వచ్చింది. మోదీ సభ సక్సెస్ కావడంతో బీజేపీలో ఉత్సాహం నిండింది.