ఓబీసీలను విడగొట్టే కుట్ర : నరేంద్ర మోదీ

ఓబీసీలను విడగొట్టే కుట్ర : నరేంద్ర మోదీ
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు ఆ పార్టీలు వ్యతిరేకం 
  • రాష్ట్రంలో అవినీతి కూటమిని గద్దె దింపాలని ఓటర్లకు పిలుపు 

బొకారో స్టీల్ సిటీ : జార్ఖండ్ లో ఓబీసీలను విడగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టాలని కాంగ్రెస్, జేఎంఎం కూటమి ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓబీసీలంతా కలిసికట్టుగా ఉంటేనే సురక్షితంగా ఉంటారని హితవుపలికారు. ఆదివారం జార్ఖండ్ లోని బొకారో స్టీల్ సిటీలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘ఓబీసీలు, దళితులు, గిరిజనుల మధ్య ఐక్యత లేనంత వరకే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1990లలో ఓబీసీ కమ్యూనిటీ రిజర్వేషన్ పొందినప్పటి నుంచీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 250 సీట్ల మార్కును దాటలేకపోయింది.

అందుకే ఓబీసీ కులాల మధ్య గొడవలు పెట్టి.. వారిని విడదీయాలని ఆ పార్టీ భావిస్తోంది” అని మోదీ ఆరోపించారు. ఓబీసీల ఐక్యతతోనే దేశం శక్తిమంతం అయిందని, ఇకపైనా ఓబీసీలు విడిపోకుండా కలిసి ఉండాలన్నారు. కులాల పేరుతో కొట్లాడుతూ విడిపోతే ఓబీసీలంతా బలహీనమవుతారని హెచ్చరించారు. ‘‘జార్ఖండ్ లోని చోటానాగపూర్ ప్రాంతంలో ఓబీసీల్లో 125 ఉప కులాలు ఉన్నాయి. వీరిలో యాదవులకు కుర్మీలకు, సోనార్లకు లోహర్లకు, ఇతర ఉపకులాలకు మధ్య కాంగ్రెస్, జేఎంఎం చిచ్చు పెట్టాలని చూస్తోంది.

అందుకే మీరంతా ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటారు” అని మోదీ చెప్పారు. అలాగే జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్ అంటోందని, అలా చేస్తే అక్కడ మళ్లీ భారత రాజ్యాంగం అమలుకాదన్నారు. 

కాంగ్రెస్ కంటే మేమే ఎక్కువిచ్చాం..

జార్ఖండ్ రాష్ట్రానికి కాంగ్రెస్ సర్కారు కంటే ఎన్డీయే సర్కారు నుంచే ఎక్కువ నిధులు వచ్చాయని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘కేంద్రంలో 2004 నుంచి 2014 వరకూ పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉండగా.. మేడమ్ సోనియా గాంధీ ప్రభుత్వాన్ని నడిపారు. ఆ పదేండ్లలో కేంద్రం నుంచి జార్ఖండ్ కు రూ. 80 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. తర్వాత మోదీ సర్కారు వచ్చింది. ఈ పదేండ్లలో మేం జార్ఖండ్ కు రూ. 3 లక్షల కోట్ల నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో 50కిపైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాం. బొకారో ఎయిర్ పోర్టు త్వరలోనే ప్రారంభం కానుంది.

సేండ్రీ ఫర్టిలైజర్ ప్లాంట్ వంటి మూతపడిన పరిశ్రమలను ఓపెన్ చేశాం. వేలాది మదికి ఉపాధి కల్పించాం” అని ఆయన వివరించారు. తమను గెలిపిస్తే గోగో దీదీ యోజన కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 ఆర్థిక సాయం అందజేస్తామని, పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోకి చొరబాట్లను పూర్తిగా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, జేఎంఎం కూటమి అవినీతిలో కూరుకుపోయిందని మోదీ అన్నారు.

పేపర్ లీక్ మాఫియా, ఇసుక మాఫియాతో దోపిడీ చేస్తున్నారన్నారు. అవినీతి కూటమిని గద్దెదింపి.. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 13, 20వ తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. 23వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.