రాష్ట్రంలో దోచుకునేవారిని వదిలిపెట్టేది లేదు : ప్రధాని మోడీ

రాష్ట్రంలో దోచుకునేవారిని వదిలిపెట్టేది లేదు : ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డు అని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ బేగంపేటలో నిర్వహించిన బీజేపీ స్వాగత సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

మునుగోడు ప్రజలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని అన్నారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం రాష్ట్ర  ప్రభుత్వం మెత్తం మునుగోడులో మకాం వేసిందంటూ సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులు అని ఆరోపించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో రాష్ట్ర బీజేపీ పోరాటాన్ని ప్రశంసించారు. 

తిట్లే.. నాకు బలం

కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుంటున్నారని ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు. 22 ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని, ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు. కొంతమంది నిరాశవాదులు అదే పనిగా తిడుతుంటారని, రాష్ట్ర పాలకులకు తనను తిట్టడమే తెలుసన్నారు. తనను, బీజేపీని తిడితే రాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందా..? అని ప్రశ్నించారు.  మంత్రులను తీసుకోవడం తీసేయడం కూడా మూఢవిశ్వాసాలతో చేస్తున్నారని మోడీ చెప్పారు. 

అవినీతిపరులకు కడుపుమండుతోంది

‘‘హైదరాబాద్‌ ఐటీ రంగానికి హబ్‌గా మారింది. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మూఢవిశ్వాసాలను నిర్మూలిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్‌ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ఆధార్‌, మొబైల్‌, యూపీఐ వంటి సేవలతో అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. నేరుగా లబ్ధిదారులకే ఇస్తుండటంతో అవినీతిపరులకు కడుపుమండుతోంది.’ అని అన్నారు. 

తొలి ప్రాధాన్యత ప్రజలకే.. కుటుంబానికి కాదు

‘కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంనూ 2 కోట్ల మందికి రేషన్‌ బియ్యం పంపిణీ చేశాం. ప్రధాని ఆవాస్‌ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని ఆవాస్‌ యోజన పథకం లబ్ధి దక్కకుండా చేశారు. నా తొలి ప్రాధాన్యత ప్రజలకే.. కుటుంబానికి కాదు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే నా లక్ష్యం’ అని అన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ వికసించే అవకాశాలు

తెలంగాణ కార్యకర్తల పోరాటం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ వికసించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కష్ట సమయంలో జనం బీజేపీకి అండగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కమలం వికసించబోతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు బీజేపీ కార్యకర్తలను కలుసుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1984లో బీజేపీ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే.. రాష్ట్రం నుంచి జంగారెడ్డి గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తాను కూడా బీజేపీలో చిన్న కార్యకర్తనని అన్నారు. హైదరాబాద్ తనకు  ఇచ్చిన ప్రేమను వడ్డీతో సహా తిరిగి ఇస్తానని చెప్పారు.

బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలతో మోడీ మోడీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి మోడీ సంతోషం వ్యక్తం చేశారు. మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం కొనసాగింది. సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.