న్యూఢిల్లీ: ఇండియన్ స్కిల్డ్ వర్కర్ల కోసం జర్మనీ వీసా కోటాను భారీగా పెంచడం అద్భుతమైన నిర్ణయమని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘జర్మనీ ఆర్థికాభివృద్ధిలో ఇండియన్ల పాత్ర ఎంతో కీలకం. అందుకే జర్మనీ వీసాల పెంపు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఏడాదికి కేవలం 20 వేల వీసాలు మాత్రమే మంజూరు చేసేది. ఇక నుంచి ఏటా స్కిల్ ఉన్న 90 వేల మంది ఇండియన్స్‌కు అవకాశం కల్పిస్తున్నది. ఇండియన్స్ స్కిల్స్‌పై జర్మనీకి ఉన్న విశ్వాసం అద్భుతం’’ అని ఆయన తెలిపారు.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో శుక్రవారం నిర్వహించిన ఇండియా, జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)’ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన జర్మన్ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఉక్రెయిన్, వెస్ట్ ఆసియాలో శాంతి స్థాపనకు చొరవ చూపాలని మోదీని ఒలాఫ్ స్కోల్జ్ కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఏ సమస్యకైనా యుద్ధం అనేది పరిష్కారం కాదన్నారు. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు అవసరమైతే ఇండియా సహకరిస్తుందన్నారు.
‘‘21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు 20వ శతాబ్దంలో ఏర్పాటైన గ్లోబల్ ఫోరమ్‌లు సరిపోవనేది నా అభిప్రాయం. దీనికి ఒలాఫ్ కూడా అంగీకరించారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు మరిన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది’’అని మోదీ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ‘ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్’ సదస్సును ప్రారంభించిన మోదీ.. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ టైమ్‌లో ఇండియా, జర్మనీ మధ్య ఉన్న బంధం.. మరింత బలోపేతం అవుతదని ధీమా వ్యక్తం చేశారు.
పెట్టుబడులతో రండి
పెట్టుబడులకు ఇండియా కంటే మంచి ప్లేస్ లేదని ప్రధాని మోదీ అన్నారు. జర్మన్ వ్యాపారులు ఇన్వెస్ట్మెంట్లతో వస్తే.. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తదని హామీ ఇచ్చారు. ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం అని సూచించారు. దేశాభివృద్ధిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగస్వాములై.. ‘మేక్ ఫర్ ది వరల్డ్’కు చేరుకోవాలని సూచించారు. ‘‘ఇండియా గ్లోబల్ ట్రేడ్, మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతున్నది. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, పోర్ట్స్‌లో ఇండియా రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడ్తున్నది. ఇండియా.. డైవర్సిఫికేషన్, డీ రిస్క్, ట్రేడ్, మ్యానుఫాక్చరింగ్కు ప్రధాన కేంద్రంగా మారుతున్నది’’అని తెలిపారు.