రైతులకు కాంగ్రెస్​ చేసిందేమీ లేదు : మోదీ

రైతులకు కాంగ్రెస్​ చేసిందేమీ లేదు : మోదీ
  • రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను ప్రోత్సహించింది
  • ఈస్టర్న్​ రాజస్థాన్​ కెనాల్​ ప్రాజెక్ట్ లో జాప్యమే ఇందుకు నిదర్శనం
  • తమ పాలసీ నీటి వివాదాలను పరిష్కరించడమేనని వెల్లడి

 జైపూర్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఇంతవరకూ కాంగ్రెస్​ చేసిందేమీ లేదని ప్రధాని మోదీ అన్నారు. అన్నదాతల గురించి గొప్పగా మాట్లాడుతారు తప్ప.. వారికోసం ఏమీ చేయరని, చేసేవాళ్లనూ చేయనివ్వరని మండిపడ్డారు. రాజస్థాన్​లో బీజేపీ సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఏక్​ వర్ష్​ పరిణాం ఉత్కర్ష్’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 

రూ. 46,400 కోట్ల విలువైన ఇంధనం, రోడ్డు, రైల్వేలు, నీటికి సంబంధించిన 24 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దాడియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను ప్రోత్సహించడం తప్ప.. అన్నదాతల కోసం కాంగ్రెస్​ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. ఈస్టర్న్​ రాజస్థాన్​ కెనాల్​ ప్రాజెక్ట్​(ఈఆర్​సీపీ)లో జాప్యమే ఇందుకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

వారు వివాదాలు సృష్టిస్తే.. మేం  పరిష్కరిస్తం

రాష్ట్రాల మధ్య వివిధ నీటి వివాదాలపై చర్చలను ప్రోత్సహించడమే బీజేపీ విధానమని మోదీ పేర్కొన్నారు.  కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను సృష్టిస్తూ.. కొనసాగిస్తున్నదని మండిపడ్డారు.  తాను సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్​లోని వివిధ ప్రాంతాలకు నర్మదా నీటిని తీసుకురావాలని పెద్ద క్యాంపెయిన్​ చేపట్టానని, కాంగ్రెస్, స్వచ్ఛంద సంస్థలు దానిని ఆపేందుకు అనేక వ్యూహాలను అనుసరించాయని గుర్తుచేశారు. ‘చర్చలను ప్రోత్సహించడమే మా పాలసీ. సహకారాన్ని మేం నమ్ముతాం.. సంఘర్షణను కాదు.. పరిష్కారాలను నమ్ముతాం.. ప్రతిపక్షాలను, అంతరాయాలను కాదు. అందువల్లే మా ప్రభుత్వం ఈస్టర్న్​ రాజస్థాన్​ కెనాల్​ ప్రాజెక్టును ఆమోదించి, విస్తరించింది. 

మధ్య ప్రదేశ్, రాజస్థాన్​లో బీజేపీ సర్కారు ఏర్పడగానే పార్వతి–కాలిసింధ్–ఛంబల్​ ప్రాజెక్ట్​పై అగ్రిమెంట్​ కుదిరింది” అని వ్యాఖ్యానించారు.  ఎన్నికలు జరిగిన వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి భారీ ప్రజామోదం లభించిందని మోదీ అన్నారు. లోక్​సభలో వరుసగా మూడోసారి దేశానికి సేవచేసే అవకాశాన్ని ప్రజలు బీజేపీకి ఇచ్చారని, గత 60 ఏండ్లలో దేశంలో ఇలా జరుగలేదన్నారు. నేడు డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వాలు సుపరిపాలనకు ప్రతీకలుగా మారుతున్నాయని చెప్పారు. బీజేపీ ఏ తీర్మానం చేసినా దానిని నెరవేర్చేందుకు నిజాయితీగా కృషిచేస్తుందని, గుడ్​ గవర్నెన్స్​కు బీజేపీ గ్యారెంటీ అని దేశ ప్రజలు చెబుతున్నారని అన్నారు.

 రాజస్థాన్​ అభివృద్ధికి భజన్‌‌లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని కొనియాడారు. రాజస్థాన్‌‌లో సోలార్​ ఎనర్జీకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదగగలదని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తామని తెలిపారు.