సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందాం: మోదీ

సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందాం: మోదీ

న్యూఢిల్లీ: ఆహార భద్రత, ఇంధన భద్రత సంక్షోభం, టెర్రరిజం వంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందామని గ్లోబల్  సౌత్  దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు ఇప్పటికీ సంక్షోభంలో ఉన్నాయని, కరోనా మహమ్మారి నుంచి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదని ఆయన చెప్పారు. దానికితోడు వివిధ దేశాల మధ్య యుద్ధాల కారణంగానూ సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాయిస్  ఆఫ్  గ్లోబల్  సౌత్  సమ్మిట్’ ను భారత్  శనివారం వర్చువల్ గా ఆతిథ్యం ఇచ్చింది. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రస్తావించారు. ‘‘ఇప్పటికే క్లైమేట్  చేంజ్  సవాళ్లను మనమంతా ఎదుర్కొంటున్నాం. ఆహార, ఆరోగ్య, ఇంధన భద్రతలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. అలాగే టెర్రరిజం, వేర్పాటువాదం మరింత కలవరపెడుతున్నాయి. ఈ సవాళ్లను గ్లోబల్  సౌత్  దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది” అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్  సౌత్  దేశాల కోసం భారత్  తరపున ‘గ్లోబల్  డెవలప్ మెంట్  కాంపాక్ట్ ’ (జీడీసీ) ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. 

వాణిజ్యం, సమ్మిళిత అభివృద్ధి, టెక్నాలజీ షేరింగ్  వంటి అంశాలపై జీడీసీ దృష్టి పెడుతుందని మోదీ అన్నారు. జీడీసీతో పేద దేశాలకు లబ్ధి కలుగుతుందన్నారు. గ్లోబల్  సౌత్  దేశాలు ప్రతిపాదించిన అభివృద్ధి ప్రాధాన్యాల ఆధారంగా జీడీసీ పనిచేస్తుందన్నారు. ‘‘భారత్  తరపున గ్లోబల్  డెవలప్  కాంపాక్ట్ ను నేను ప్రతిపాదిస్తున్నాను. భారత అభివృద్ధి ప్రయాణం ఆధారంగా ఈ కాంపాక్ట్  ఫౌండేషన్  ముందుకెళుతుంది. గ్లోబల్  సౌత్  దేశాల అభివృద్ధిలో వివిధ రంగాలను దృష్టిలో పెట్టుకుని ఇది పనిచేస్తుంది. భాగస్వామ్య దేశాల సమ్మిళిత అభివృద్ధి కోసం ఈ కాంపాక్ట్  దోహదపడుతుంది” అని మోదీ అన్నారు.