కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌ది అవినీతి బంధం : ప్రధాని మోదీ

  • రెండు పార్టీలకు కుటుంబ పాలనే ముఖ్యం
  • కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కార్​ చర్యలేవి?
  • కాంగ్రెస్​ నేతలు జాతి వివక్ష చూపెడ్తున్నరు
  • దేశంలోని నలుపు రంగువాళ్లను ఆఫ్రికన్లంటున్నరు
  • రాష్ట్రపతిగా ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు
  • పీవీ నరసింహారావును అవమానించారు
  • దేశమంతా మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్​ కుట్ర
  • కాంగ్రెసోళ్లు ఇప్పుడు అంబానీ, అదానీ మాటెత్తట్లే
  • కారణమేంది.. వాళ్ల నుంచి ఎంత డబ్బు ముట్టింది? 
  • రామమందిరంపై రాజకీయాలు చేస్తున్నరని ఫైర్​
  • వేములవాడ, వరంగల్​ ఎన్నికల సభల్లో స్పీచ్​
  • రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

రాజన్నసిరిసిల్ల/ వేములవాడ/ వరంగల్‍/ హనుమకొండ, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధమని, ఆ రెండు పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యమిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీలు.. ‘కుటుంబం వల్ల, కుటుంబం చేత, కుటుంబం కోసం..’ అనే నినాదంతో పనిచేస్తున్నాయి. అనినీతి, కుంభకోణాల్లో ఆ రెండు పార్టీలు కూరుకుపోయాయి” అని ఆరోపించారు. 

బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో, వరంగల్​లో నిర్వహించిన లోక్​సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వస్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి నేషన్ ఫస్ట్.. ఫ్యామిలీ లాస్ట్. అదే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం కుటుంబ పాలనే ముఖ్యం” అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసులాంటివని ఆయన విమర్శించారు. 

మేం ఏం చేశామో మీ అందరికీ తెలుసు

పదేండ్ల కిందటి వరకు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్‍ ఏ రకమైన పాపాలు చేసిందో ప్రజలు ఇంకా మరిచిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అప్పట్లో ప్రతి నాలుగు రోజులకోసారి వేలాది కోట్ల కుంభకోణాలు బయటపడేవి. వరుస బాంబు పేలుళ్లు జరిగేవి” అని తెలిపారు.  ‘‘పదేండ్లలో మేం ఏం చేశామో అందరికీ తెలుసు. ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 

మీ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఆర్టికల్ 370 రద్దు చేసుకున్నాం. దేశంలో జమ్మూకాశ్మీర్  అంతర్భాగమైంది” అని ఆయన అన్నారు. రైతులకు బీజేపీ ప్రయారిటి ఇస్తున్నదని.. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని.. వడ్లు, పత్తిని రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశామని చెప్పారు. వరంగల్​లో టెక్స్​టైల్​ పార్క్​ ఏర్పాటు చేస్తే.. ఇక్కడి ప్రభుత్వం దాని నిర్వహణ విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్నదని ఆయన ఆరోపించారు. 

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతలు.. తోడుదొంగలు

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ మేలు చేస్తుందని భావించామని, కానీ కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్​ పనిచేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాలతో దేశ ప్రజలను వంచించిందని అన్నారు.  ‘‘కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడింది. ఓటుకు నోటు కేసుపై అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయలేదు?  కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ సమగ్ర దర్వాప్తు ఎందుకు జరపడంలేదు? కేసీఆర్​ అవినీతిపై కాంగ్రెస్​ సర్కార్​ తీసుకుంటున్న చర్యలేవి? కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు రెండు తోడుదొంగలే.

 అవి అవినీతి సిండికేట్ పార్టీలు” అని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ డబుల్ ఆర్ ట్యాక్సులతో రాష్ట్ర ప్రజలను పీడిస్తున్నదని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో డబుల్‍ ఆర్‍ ట్యాక్స్​ భారీ మొత్తంలో వసూలు చేస్తున్నరు. ఒక ఆర్‍ ఇక్కడ కలెక్షన్‍ చేస్తుంటే మరో ఆర్‍ ఢిల్లీలో ఉండి వాటిని తీసుకుంటున్నది. ఇరువురి కలెక్షన్లు కొద్దిరోజుల్లోనే ట్రిపుల్‍ ఆర్‍ కలెక్షన్లను దాటుతది” అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‍ పార్టీ అబద్ధాల కోరు పార్టీ అని దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారికి పెన్షన్‍, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి కాంగ్రెస్​ ఇచ్చిందా? మహిళలకు నెలకు 2,500 పెన్షన్‍ ఏమైంది? లోక్‍సభ ఎన్నికలయ్యాక హామీలపై ఇక్కడి కాంగ్రెస్‍ ప్రభుత్వం చేతులెత్తేస్తుంది” అని అన్నారు. ‘‘సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్లు ఇప్పుడు రాజన్నపై ఒట్టు వేస్తే జనం నమ్ముతారా?” అని ప్రశ్నించారు. 

పీవీని కాంగ్రెస్​ అవమానించింది

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, ఆయన మరణం తర్వాత పార్థివదేహాన్ని గౌరవించకుండా బయటకు తరలించిందని ప్రధాని మోదీ అన్నారు. పీవీ నరసింహారావును భారతరత్నతో గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్​ కన్ను

కాంగ్రెస్‍ పార్టీ ఓటు బ్యాంక్‍ కోసం దేశమంతా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘‘అంబేద్కర్‍ మతపర రిజర్వేషన్‍ ఇవ్వొద్దని స్పష్టంగా తెలిపారు. కానీ.. కాంగ్రెస్‍ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు కోత పెట్టి వాటిని ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. కర్నాటకలో కాంగ్రెస్‍ ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్లకు గండికొట్టి ముస్లింలకు ఇచ్చింది” అని ఆయన అన్నారు. కాంగ్రెస్‍ దృష్టిలో రాజ్యాంగానికి ఎలాంటి విలువ లేదని మండిపడ్డారు. 

కాంగ్రెస్‍ పార్టీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నది తప్పితే దళిత సోదరులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం ముందుకురావడం లేదు. మేం దళితులకు న్యాయం చేస్తామని గతంలోనే మాటిచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా అమలు చేస్తం” అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలని తాము చూస్తుంటే.. మాదిగలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఎంఐఎంకు బీజేపీ ధీటైన పోటీ ఇవ్వడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంను గెలిపించేందుకు అనేక పన్నాగాలు పన్నుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. 

రామమందిరంపై రాజకీయాలేంది?

‘‘అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం జరుపుకున్నాం. కానీ, మందిరంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నది. రాముడికి గుడి కడితే కాంగ్రెస్ ఈర్ష్య, ద్వేషం వెళ్లగక్కుతున్నది. కోర్టు తీర్పుకు తగ్గట్టుగా రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిర నిర్మాణంపై కోర్టు తీర్పును పున:పర్యవేక్షిస్తామంటూ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రాచరిక వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తున్నది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది” అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణ ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. 

కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపం మోదీ: బండి సంజయ్​

కాశీ విశ్వేశ్వరుడి ప్రతి రూపం నరేంద్రమోదీ అని కరీంనగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి దక్షిణకాశీకి విచ్చేసిన నాయకుడు మోదీ మాత్రమే అని చెప్పారు ‘‘మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నది. మోదీకి ఆస్తిపాస్తులు... బ్యాంకు బ్యాలెన్స్ లేవు. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్బకు సంచి వేసుకుని పోయే మహనీయుడు ఆయన. నా మోదీని కించపరుస్తున్న కాంగ్రెస్ నేతలారా ఖబడ్దార్. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను మెడలు పట్టి బయటకు గెంటేసిన జగమొండి నా మోదీ” అని బండి సంజయ్​ పేర్కొన్నారు.

జాతి వివక్ష చూపిస్తున్నరు

దేశంలో కాంగ్రెస్‍ పార్టీ, నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో బీఆర్‍ఎస్‍ పార్టీ దళితులను అవమానించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మేము 2014లో మొదటిసారి అధికారంలోకి రాగానే దళితులైన రాంనాథ్‍ కోవింద్‍ను దేశానికి రాష్ట్రపతిగా చేశాం. రెండోసారి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేస్తే కాంగ్రెస్‍ ఈ రెండింటిని వ్యతిరేకించింది. 

చర్మం రంగు ఆధారంగా దేశంలో ప్రజలను కాంగ్రెస్​ నేతలు వర్గీకరిస్తున్నరు. జాతి వివక్షను చూపెడ్తున్నరు. నలుపు రంగులో ఉన్నవారందరిని ఆఫ్రికన్లుగా అవమానిస్తున్నరు. చర్మం రంగు ఆధారంగానే రాష్ట్రపతిగా ద్రౌపదిముర్మును అప్పట్లో కాంగ్రెస్​ వ్యతిరేకించింది. నలుపు రంగులో ఉండే శ్రీకృష్ణుడిని ఆరాధించే దేశంలో ఇలాంటి వివక్ష సరికాదు” అని ఆయన తెలిపారు.

మూడోసారి ఎన్డీయేనే

ఇప్పటివరకు మూడు విడతల్లో లోక్​సభ ఎన్నికలు పూర్తయ్యాయని, ఈ మూడు దశల్లో మూడ్​ చూస్తుంటే ఇండియా కూటమికి ఓటమి తప్పదని తేలిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఇప్పటివరకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లోనే ఎన్డీయేకే జనం పట్టం కట్టినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్‍ మాత్రం ఎక్కడెక్కడ గెలుస్తుందో భూతద్దంలో చూసుకోవాల్సిన పరిస్థితి. నాలుగో దశకొచ్చేసరికి.. ఆ పార్టీ మైక్రోస్కోప్‍ తెచ్చుకొని వెతుక్కోవాల్సి వస్తది” అని వ్యాఖ్యానించారు.  

ఇండియా కూటమిలో ఒక్కో పార్టీలో ఒక్కో ప్రధాని అభ్యర్థి ఉన్నారని, వారికి అధికారమిస్తే ఐదేండ్లలో ఐదుగురు ప్రధానమంత్రులను మారుస్తారని ఆయన విమర్శించారు. ‘‘ఇండియా కూటమి, కాంగ్రెస్‍ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. ఆ రాష్ట్ర సంపదను ఏటీఎంలా మార్చుకుంటున్నది. ఈ మధ్యనే జార్ఖండ్‍లో నోట్ల కట్టల గుట్టలు బయటపడితే.. మరోచోట కాంగ్రెస్‍ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్ల క్యాష్ బయటపడ్డది. 

అవినీతిపై మేం చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే మాపై కాంగ్రెస్‍ నేతలు విమర్శలు చేస్తున్నరు” అని మండిపడ్డారు. 40 ఏండ్ల కింద బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిస్తే అందులో ఒకరు వరంగల్‍ నుంచి జంగారెడ్డి అని మోదీ గుర్తుచేశారు. తెలంగాణతో బీజేపీకి విడదీయలేని బంధం ఉందని అన్నారు. కరీంనగర్​ నుంచి బండి సంజయ్​ని, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ ను, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్​ను, వరంగల్‍ నుంచి ఆరూరి రమేశ్​ను, మహబూబాబాద్‍ నుంచి  సీతారాం నాయక్​ను ఎంపీలుగా గెలిపించాలని ఆయన కోరారు. 

అంబానీ, అదానీ జపం ఏది?

అంబానీ, అదానీ జపాన్ని కాంగ్రెస్​ నేతలు వదిలేశారని..  అందుకు కారణమేందో వాళ్లే చెప్పాలని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఎన్నికల నోటిఫికేషన్​ రాక ముందు అంబానీ, అదానీ అంటూ కాంగ్రెస్​ నేతలు జపం చేశారు. వాళ్ల పేరు చెప్పి మాపై ఇష్టమున్నట్లు మాట్లాడారు. విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. ఎందుకో?! కారణం వాళ్లే చెప్పాలి. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్​కు ట్రక్కుల్లో ఎంత డబ్బు ముట్టింది?” అని ప్రశ్నించారు.