జల్గావ్: మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని నేరమని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ట్రెయినీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన ‘లక్పతి దీదీ సమ్మేళన్’ లో పాల్గొన్న మోదీ, ప్రసంగించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. “ప్రతి రాష్ట్రానికి.. ప్రతి రాజకీయ పార్టీకి చెబుతున్నా.. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు” అని మోదీ హెచ్చరించారు.
పదేండ్లలో మహిళలకు 9 లక్షల కోట్లిచ్చినం
స్వాతంత్ర్యం వచ్చాక తమ పాలనలోనే పదేండ్లలో మహిళల కోసం ఎంతో చేశామని ప్రధాని మోదీ తెలిపారు. 2014 వరకు స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) కేవలం రూ. 25వేల కోట్ల కంటే తక్కువగానే ఇచ్చారని, కానీ పదేండ్లలో తాము 9 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడించారు. భవిష్యత్తు తరాలను శక్తివంతం చేసేందుకు లక్పతి దీదీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
4.3లక్షల స్వయంసహాయక సంఘాల్లోని 48 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.2,500 కోట్ల నిధులను మోదీ ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నదని, ఇందులో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని మోదీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహిళల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం ఏటా ప్రయత్నాలు చేస్తున్నదని, 3 కోట్ల మంది సోదరీమణులను లక్షాధికారులను చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని తెలిపారు.
ప్రధాని మోదీకి పాక్ ప్రభుత్వం ఆహ్వానం
ఇస్లామాబాద్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) కు చెందిన కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ) సమావేశానికి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం పంపింది. మోదీతో పాటు ఎస్ సీఓకు చెందిన ఇతర నేతలను కూడా ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబరు 15, 16న ఈ సమావేశం జరగనుంది. ఎస్ సీఓ అధ్యక్ష బాధ్యతలను ప్రస్తుతం పాకిస్తాన్ చూసుకుంటున్నది.
అయితే.. భారత్, పాక్ మధ్య క్షీణించిన సంబంధాల నేపథ్యంలో ఎస్ సీఓ సమావేశానికి మోదీ హాజరయ్యే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను ఆ సదస్సుకు పంపే అవకాశం ఉంది. నిరుడు ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ సిటీలో జరిగిన సదస్సుకు మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తదితరులు కూడా హాజరయ్యారు.