సంకీర్ణ సర్కార్​కు మోదీ రెడీ

సంకీర్ణ సర్కార్​కు మోదీ రెడీ
  • ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక.. ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణం 
  • మోదీ నివాసంలో కూటమి నేతల భేటీ 
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ సహా మిత్రపక్షాల నేతలు హాజరు 
  • రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా సమర్పించిన ప్రధాని 
  • ప్రస్తుత 17వ లోక్ సభ రద్దు 
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ రేపు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీయే నేతలు 

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో గత పదేండ్లలో వరుసగా రెండు సార్లు సొంత మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ లేకపోవడంతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు సిద్ధమైంది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి సంకీర్ణ సర్కారును నడిపేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) కూటమి పార్టీల నేతలు తమ లీడర్ గా మోదీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఈ నెల 8న ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మూడోసారి గెలిచిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఆ కూటమి పార్టీల నేతలు రెండు గంటలు సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ, కొత్త ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్​నాథ్, అమిత్ షా, టీడీపీ చీఫ్ చంద్రబాబు, బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, మహారాష్ట్ర సీఎం, శివసేన (షిండే) చీఫ్ ఏక్ నాథ్ షిండే, ఎల్జేపీ(ఆర్) నేత చిరాగ్ పాశ్వాన్, ఎన్ సీపీ నేత ప్రఫుల్ పటేల్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, జేడీఎస్ నేత కుమారస్వామి, అప్నా దళ్ నేత అనుప్రియా పటేల్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, హెచ్ఏఎం (సెక్యులర్) నేత జితన్ రామ్ మాంఝి తదితరులు మీటింగ్ లో పాల్గొన్నారు. మోదీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్టు తీర్మానం చేశారు.  

ఎన్డీఏ పార్టీల భేటీలో పలు అంశాలపై తీర్మానం చేసినట్టు మీటింగ్ తర్వాత కూటమి తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు.  గడిచిన పదేండ్లలో దేశంలోని140 కోట్ల మంది ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడాన్ని చూశామని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి, విజయం సాధించినందుకు మేమంతా గర్వపడుతున్నాం. ఎన్డీయే కూటమిలోని నేతలమంతా మా నాయకుడిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం అని కూటమి నేతలు తీర్మానంలో పేర్కొన్నారు. 

పేదలు, మహిళలు, యువత, రైతులు, అణగారిన వర్గాలకు సేవ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, దేశ వారసత్వాన్ని పరిరక్షించేందుకు తమ పనిని కొనసాగిస్తామని నేతలు తీర్మానం చేశారు. కాగా,1962 తర్వాత కేంద్రంలో అధికార కూటమి వరుసగా మూడోసారి పవర్ లోకి రావడం ఇదే తొలిసారి.   

మోదీ రాజీనామా.. తిరిగి 8న ప్రమాణం 

ప్రస్తుత లోక్ సభ పదవీకాలం ఈ నెల 16 వరకూ ఉండగా.. ఆ గడువులోపు కొత్త సర్కారు కొలువుదీరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ప్రస్తుత కేబినెట్ తో చివరి మీటింగ్ నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రిమండలితో సహా రాజీనామా సమర్పించారు. ప్రస్తుత 17వ లోక్ సభను రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని రాష్ట్రపతి కోరారు. అనంతరం కేంద్ర కేబినెట్ సలహా మేరకు 17వ లోక్ సభను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

రేపు రాష్ట్రపతి వద్దకు ఎన్డీఏ నేతలు 

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని కోరేందుకు ఎన్డీఏ నేతలు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. మోదీని తమ కూటమి నేతగా ఎన్నుకున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని తెలియజేయనున్నారు. ప్రధాని, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అనుమతినివ్వాలని కోరనున్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్డీఏ మీటింగ్ లో మోదీని చంద్రబాబు, నితీశ్ కుమార్ కోరినట్టుగా కూటమి వర్గాలు తెలిపాయి. కాగా, ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లాంఛనమే కానుంది. దీంతో మోదీ ప్రధానిగా మూడోసారి శనివారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు కూడా షురువయ్యాయి. అందుకే ఈ నెల 9వ తేదీ వరకూ రాష్ట్రపతి భవన్ లోకి సందర్శకులకు అనుమతిని కూడా రద్దు చేశారు. 

మూడు కమలం పూలతో మోదీకి ధన్ ఖడ్ బొకే 

రాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించిన తర్వాత ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను కలిశారు. ఈ సందర్భంగా లిల్లీ పూలతోపాటు మూడు కమలం పువ్వులు ఉన్న ప్రత్యేక బొకేను మోదీకి ధన్ ఖడ్ అందజేశారు. మోదీ మూడోసారి ప్రధాని కానుండటానికి గుర్తుగా మూడు కమలం పువ్వులతో బొకేను ధన్ ఖడ్ తయారు చేయించినట్టు తెలుస్తోంది. అలాగే ఉపరాష్ట్రపతి సొంత జిల్లా అయిన రాజస్థాన్ లోని ఝుంఝును నుంచి తెప్పించిన రుచికరమైన పేడ స్వీట్, మీరట్ నుంచి తెప్పించిన బెల్లాన్ని కూడా ప్రధానికి అందజేశారని అధికారిక వర్గాలు తెలిపాయి. 

బాబు, నితీశ్ మద్దతు లేఖలు  

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఆ పార్టీకి ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్ల దూరంలో 240 సీట్లకు పరిమితమైంది. మిత్రపక్షాలకు వచ్చిన 53 సీట్లను కలుపుకొని మొత్తం 293 సీట్ల ఫుల్ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కూటమిలో 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ కింగ్ మేకర్లుగా మారాయి.

 దీంతో ఆ రెండు పార్టీలు ఎన్డీఏలోనే ఉంటాయా? ఇండియా కూటమి వైపు మొగ్గుతాయా? అన్నది చర్చనీయాంశం అయింది. అయితే, తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని బుధవారం టీడీపీ, జేడీయూ ప్రకటించాయి. ఆ పార్టీల చీఫ్ లు చంద్రబాబు, నితీశ్ కూడా ఎన్డీయే కూటమి భేటీకి హాజరయ్యారు. మోదీకి మద్దతు తెలుపుతూ వారు లేఖలు సైతం ఇచ్చినట్టుగా కూడా కూటమి వర్గాలు వెల్లడించాయి. 

గెలుపోటములు పాలిటిక్స్​లో భాగం: మోదీ 

రాజకీయాల్లో గెలుపోటములు భాగమని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం తన సెకండ్ టర్మ్ లో చివరి కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇకపై నెంబర్స్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. ‘‘గత పదేండ్ల పాలనలో మనం ఎన్నో మంచి పనులు చేశాం. ఇకముందూ అలాగే పని చేస్తాం” అని ఆయన కేబినెట్ సహచరులకు తెలిపారు. గత పదేండ్లలో కేంద్ర మంత్రులంతా బాగా కష్టపడి పని చేశారని మెచ్చుకుంటూ, వారికి థ్యాంక్స్ చెప్పారు.