దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే

ఏనాడూ తమ పార్టీ తప్పుడు దారిలో పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే అని, అధికారం కంటే సిద్ధాంతాలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. భారత్‌ను విశ్వ గురువుగా నిలపాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సైద్ధాంతిక పునాదిపై నడుస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ పెట్టుకున్న ఆశయాలు, సిద్ధాంతాల కోసం ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడని కార్యకర్తలు ఉన్న పార్టీ ఇదన్నారు. కేవలం రెండు సీట్ల నుంచి ఇవాళ భారీ మెజారిటీతో దేశాన్ని పాలిస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. అయితే తాము ఏనాడూ కేవలం అధికారం కోసమే పాకులాడిన దాఖలాలు లేవని, నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కట్టుబడిన పార్టీ అని అన్నారు.  ఒకే ఒక్క ఎంపీని తమ పార్టీ వైపు తిప్పుకొని ఉంటే వాజ్‌పేయి హయాంలో ప్రభుత్వం నిలబడి ఉండేదని, కానీ ఆ రోజు సిద్ధాంతానికి కట్టుబడి కేవలం 13 రోజులకే అధికారం కోల్పోయామన్నారు. ఆశయాలు, లక్ష్యాల కోసం తమ పార్టీ ఏర్పడిందని బండి సంజయ్ చెప్పారు. 

దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రజల కోసం మోడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. అధికారం కోసం పని చేసే పార్టీలు దేశంలో నిలబడలేవని అన్నారు. తెలంగాణలో అరాచక, నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగుతోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని, ప్రజలు కూడా నిర్ణయించుకున్నారని అన్నారు. కార్యకర్తల త్యాగాలతో, ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని సంజయ్ చెప్పారు. కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్‌లో రూ.120కి చేరువలో పెట్రోల్ రేటు

తల్లిని వదిలి హాస్టల్‌కు వెళ్లలేకనే కిడ్నాప్​ డ్రామా

జర్నలిస్టులు ఎంత పనిచేసినా గుర్తింపు తక్కువే