ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి ఆయన నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్‌కు చేరుకోనున్న మోదీ, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:45 గంటలకు సభా స్థలికి చేరుకొని 4.45 గంటల వరకు సభలో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బీదర్ చేరుకోనున్నట్లు పీఎంవో వెల్లడించింది.
లక్షన్నర మందితో ప్రధాని సభ: అర్వింద్
నిజామాబాద్‌లో అక్టోబర్3న జరిగే మోదీ సభకు లక్ష న్నర మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిజామాబాద్ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీ మైదానంలో మోదీ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వద్దన్న సీఎం కేసీఆర్..
ఈ పథకం ఫ్లెక్సీలపై ఫొటోలు వేయించుకొని ప్రచారం చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీపీసీలో కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును జిల్లా కేంద్రం నుంచి మోదీ జాతికి అంకితం చేస్తారన్నారు. అనంతరం పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య, ప్రేమేందర్‌రెడ్డి, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, దినేశ్కులాచారి తదితరులు ఉన్నారు.