ప్రధాని నరేంద్ర మోదీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాఫ్టర్ లో మహబూబ్ నగర్ కు వెళ్లారు. మహబూబ్‌నగర్ వేదికగా ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ‘పాలమూరు ప్రజా గర్జన’ పేరుతో భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తున్న సభలో మోదీ మాట్లాడనున్నారు.
ముందుగా రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత సభలో పాల్గొననున్నారు. సభా వేదికగా తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటించే అవకాశం ఉందా..? సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతారా..? బీఆర్ఎస్ సర్కార్ తీరుపై ప్రశ్నించనున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
భారీ ఏర్పాట్లు
మోదీ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోదీ పాల్గొనే సభ వద్ద, సభకు వెళ్లే అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మోదీ కౌటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కాషాయ తోరణాలు కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణం వద్ద మోదీ భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కేసీఆర్ దూరం..
మోదీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్మరోసారి దూరంగా ఉన్నారు. కరోనా ఫస్ట్వేవ్తర్వాత ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కేసీఆర్ఆయనకు స్వాగతం పలకడం లేదు. ఈసారి కూడా అదే విధంగా దూరంగా ఉంటున్నారు. సీఎం వైరల్ఫీవర్తో బాధపడుతున్నారని కొన్ని రోజుల కింద మంత్రి కేటీఆర్ట్వీట్ చేశారు.