ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. బాంబు బ్లాస్ట్‌ ప్లాన్ చేసినట్లు వాట్సప్ మెసేజ్

ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. బాంబు బ్లాస్ట్‌ ప్లాన్ చేసినట్లు వాట్సప్ మెసేజ్

భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం(డిసెంబర్ 07) వాట్సప్ మెసేజ్‌ వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. సందేశం పంపిన మొబైల్ నెంబర్ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్నట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకోవడానికి వెంటనే పోలీసు బృందాన్ని అక్కడికి పంపామని సదరు అధికారి తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు వాట్సప్ మెసేజ్ వచ్చింది. ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకుని ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు బాంబు బ్లాస్ట్‌కు ప్లాన్ చేసినట్లు ఆ వాట్సప్ మెసేజ్‌లో ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని అజ్మీర్‌కు పంపారు. 

ALSO READ : ఢిల్లీలో కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగులు

మెసేజ్ పంపిన వ్యక్తి మతి స్థిమితం కోల్పోయి కానీ, తాగిన మత్తులో కానీ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సంబధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ  మొదలు పెట్టారు.

గతం వారం ఇలాంటి బెదిరింపులే

ప్రధాని మోదీని హత్య చేస్తామని గతంలోనూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. గడిచిన వారం ముంబై పోలీసులకు కాల్ చేసిన అజ్ఞాత మహిళ ప్రధాని మోదీని చంపేయనున్నట్లు హెచ్చరించింది. ఆ బెదిరింపులు వచ్చిన గంటల వ్యవధిలోనే సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.