
- మూడు రోజుల పర్యటన ముగింపు
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. 72 గంటల పాటు అగ్రరాజ్యంలో పర్యటించిన ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో అమెరికా ఎన్నికల అంశానికి మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌తో భేటీ కాకుండానే మోదీ తిరిగి వచ్చారు.
మోదీ తనను కలిసేందుకు అమెరికా వస్తున్నారని పోయిన వారం ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ ర్యాలీలో ప్రచారం చేశారు. కానీ.. ఆయనతో మోదీ భేటీ కాలేదు. పర్యటనలో భాగంగా మొదటి రోజైన శనివారం ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడాతో యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్ లో మోదీ భేటీ అయ్యారు.
అక్కడ నలుగురు లీడర్లు క్వాడ్ సమ్మిట్‌కు హాజరయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా, జపాన్ లీడర్లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రెండో రోజైన ఆదివారం మోదీ న్యూయార్క్ లో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. కాగా, సోమవారం న్యూయార్క్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, మోదీతో భేటీ అయ్యారు. తర్వాత ఈ భేటీపై జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, సమగ్రతకు మోదీ మద్దతు ఇచ్చారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.