హర్యానాలో చరిత్ర సృష్టించినం :  ప్రధాని నరేంద్ర మోదీ

హర్యానాలో చరిత్ర సృష్టించినం :  ప్రధాని నరేంద్ర మోదీ
  • ఆ రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా బీజేపీకి ఓటేశారు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: హర్యానాలో వరుసగా మూడోసారి తాము అధికారంలోకి వచ్చామని, ఇది ఆ రాష్ట్రంలో ఫస్ట్ టైం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ రాష్ట్రంలో వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను అభినందించారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడారు. 1966లో హర్యానా ఏర్పడిందని, ఇప్పటివరకూ 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని తెలిపారు. 10 ఎన్నికల్లో హర్యానా ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారని గుర్తుచేశారు.

కానీ, గత మూడు ఎన్నికల్లో మాత్రం ఒక పార్టీనే గెలిపించారని చెప్పారు. హర్యానా చరిత్రలో ఒక పార్టీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు తమను గెలిపించడంతో పాటు ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు, ఓట్  షేర్  ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. వారు మనస్ఫూర్తిగా బీజేపీకి ఓటువేశారని తెలిపారు. అలాగే కాంగ్రెస్  పార్టీపై ప్రధాని విరుచుకుపడ్డారు. యువత, ఆర్మీకి కాంగ్రెస్  వ్యతిరేకమని విమర్శించారు. ప్రజలు గర్వించదగ్గ దేశ వ్యవస్థలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్  పార్టీ పరాన్నజీవి వంటిదని, ఎప్పుడూ తన మిత్రపక్షాలపైనే ఆధారపడుతుందని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్  వల్ల ఓడిపోయే అవకాశం ఉందని జమ్మూకాశ్మీర్ లో వారి మిత్రపక్షాలు భయపడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా కూటమి పార్టీల వల్లే కాంగ్రెస్  చాలా చోట్ల గెలిచింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్  కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలు నష్టపోయాయి. రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ ను కూటమి పార్టీలు మింగేస్తాయి” అని మోదీ వ్యాఖ్యానించారు.