మోరేనా/ఆగ్రా:ప్రజల సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కుట్రను తిప్పికొడ్తానని, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య తాను అడ్డుగోడలా నిలబడ్తానని తెలిపారు. ఇందిరా గాంధీ చనిపోయాక ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వ పన్ను రద్దు చేశారని అన్నారు. ఆ టైమ్‌లో కాంగ్రెస్ ఎంతో లబ్ధి పొందిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ప్రజల వారసత్వ సంపదపై పన్ను విధించేందుకు సిద్ధమవుతోందని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని మోరేనా సిటీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి వద్ద ఉన్న సంపద నుంచి సగానికి పైగా ఆస్తిని ‘వారసత్వ పన్ను’ రూపంలో గుంజుకుంటది. మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల వద్ద ఉన్న బంగారం, కష్టపడి దాచుకున్న డబ్బులను సర్వే చేసి లాక్కునేందుకు సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ చేసిన పాపాల గురించి చెప్తాను జాగ్రత్తగా చెవులు ఇటుపెట్టి వినండి. ఇందిరా గాంధీ హయాంలో వారసత్వ పన్ను చట్టం ఉండేది. ఎవరైనా చనిపోతే వారి పేరు మీదున్న ఆస్తిలో సగం గవర్నమెంట్‌కు ఇవ్వడమే ఆ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు చట్ట ప్రకారం.. ఆమె పేరుమీదున్న కోట్ల రూపాయల ఆస్తిలో సగం గవర్నమెంట్‌కు ఇవ్వాలి. కానీ.. అప్పుడే రాజీవ్‌గాంధీ వారసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ఇందిరా గాంధీ ఆస్తులను తన పేరు మీద మార్చుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే చట్టాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది’’ అని అన్నారు.
సంపద గుంజుకుంటామంటే ఊరుకోం..
వారసత్వ చట్టం రద్దుతో నాలుగు తరాల పాటు గాంధీ ఫ్యామిలీ లబ్ధి పొందిందని మోదీ విమర్శించారు. ‘వారసత్వ పన్ను చట్టం తీసుకొస్తున్నామని అపోజిషన్ పార్టీల అడ్వైజర్, రాజకుమారుడే (రాహుల్) స్వయంగా చెప్పాడు. అతని ప్రయత్నాన్ని మేం అడ్డుకుంటాం. ఎంతో కష్టపడి సంపాధించుకున్న డబ్బులు, బంగారం కాంగ్రెస్ గుంజుకుంటామంటుంటే నేను చూస్తూ ఊరుకోను. ప్రజలకు, కాంగ్రెస్ మధ్య అడ్డుగోడలా నిలబడ్తా. మాకు దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. కానీ.. కాంగ్రెస్‌కు మాత్రం వాళ్ల ఫ్యామిలీలే ముఖ్యం. మా దృష్టిలో మాత్రం పేద ప్రజలకే దేశ సంపదపై హక్కు ఉంటది’ అని అన్నారు.
అంబేద్కర్‌కే వెన్నుపోటు పొడిచిన్రు..
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అంబేద్కర్‌కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన మతపరమైన రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కర్నాటకలో చాలామంది ముస్లింలను కాంగ్రెస్ రాత్రికి రాత్రి ఓబీసీ జాబితాలో చేర్చిందన్నారు. ఇది చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. మతప్రాతిపదికన కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించారన్నారు.