- వార్ వద్దు.. కూర్చొని మాట్లాడుకోవాలని జెలెన్ స్కీకి సూచన
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచన
- చర్చలతోనే ఎన్నో సమస్యలు పరిష్కారమైతయ్
- స్నేహితుడిగా సహాయం చేసేందుకు నేను రెడీ
- యుద్ధం విషయంలో మేము తటస్థంగా లేం
- శాంతి వైపే దృఢంగా నిలబడినం
- ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని
- జెలెన్స్కీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోదీ
కీవ్ : రష్యా, ఉక్రెయిన్ వార్ విషయంలో ఇండియా తటస్థంగా లేదని.. శాంతి వైపే దృఢంగా నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైఖరి మార్చుకోలేదన్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. దీని కోసం రష్యా, ఉక్రెయిన్ ముందుకు రావాలని కోరారు. చర్చలు, దౌత్య మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకోసం అన్నివిధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా యుద్ధ క్షేత్రమైన ఉక్రెయిన్‌లో మోదీ పర్యటించారు. పోలెండ్ ట్రిప్ ముగించుకుని ఏడు గంటల పాటు రైల్లో ప్రయాణించి శుక్రవారం ఉదయం కీవ్‌కు చేరుకున్నారు. అక్కడి భారతీయులు రైల్వే స్టేషన్లో మోదీకి జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతం పలికారు. జెలెన్స్కీని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత రష్యా దాడిలో చనిపోయిన చిన్నారులకు నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు. కాగా, మోదీ పర్యటన వివరాలను భద్రతా కారణాల రీత్యా అధికారులు గోప్యంగా ఉంచారు. ఉక్రెయిన్‌లోని ఇస్కాన్ బృంద సభ్యులు కూడా మోదీని కలిశారు.
నాలుగు రంగాల్లో కీలక ఒప్పందాలు
పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం ఎంతో ముఖ్యమని మోదీ అన్నారు. ‘‘ఒక ఫ్రెండ్ మాదిరి రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం సమయాన్ని వృథా చేయకుండా ఆ దిశలో పయనించాలి’’ అని చెప్పారు. జెలెన్స్కీతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైనిక స్థితిగతులు, ఆహారం, ఇంధన భద్రతతో పాటు శాంతిని నెలకొల్పే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. మరోవైపు, గ్లోబల్ పీస్ సమిట్‌లో తన భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ఇండియాను ఉక్రెయిన్ కోరింది. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య అంశాలపై చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నట్లు తెలిపింది. తర్వాత, ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు ఇండియన్ గవర్నమెంట్ వెల్లడించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కాగా, ఇండియా నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్లను జెలెన్స్కీకి మోదీ అందజేశారు. వీటిని ఆరోగ్య మైత్రి కింద దేశీయంగా ప్రాజెక్ట్ ‘భీష్మ’లో భాగంగా తయారు చేశారు. మొత్తం 10 భీష్మ క్యూబ్‌లను ఉక్రెయిన్‌కు ఇచ్చారు.
చర్చలు, దౌత్య మార్గమే బెటర్ : జైశంకర్
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్‌లో ఇండియా స్టాండ్ శాంతి వైపే అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. మోదీతో ఆయన కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ‘‘ఎలాంటి సమస్య అయినా చర్చలు, దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలనే ఇండియా నమ్ముతది. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చర్చలతోనే చల్లబర్చాలి. రష్యా పర్యటనలో భాగంగా పుతిన్‌తో మోదీ ప్రస్తావించిన విషయాలు
తాజాగా చర్చకు వచ్చాయి’’ అని జైశంకర్ అన్నారు.
33 ఏండ్ల తర్వాత తొలిసారి
1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ ఏర్పడిన తర్వాత ఇండియా ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. 33 ఏండ్ల తర్వాత ఉక్రెయిన్‌లో ఇండియా ప్రధాని అడుగుపెట్టారు. కాగా, ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్‌స్కీ భేటీ అయ్యారు.
అదేవిధంగా, ఈ ఏడాది జులైలో మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. అక్కడ పుతిన్‌తోనూ భేటీ అయ్యారు. సరిగ్గా ఆరు వారాల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ మోదీ సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
జెలెన్ స్కీ భావోద్వేగం.. ఆలింగనంతో ధైర్యం చెప్పిన మోదీ
కీవ్‌లో అడుగుపెట్టిన మోదీకి స్వాగతం పలుకుతూ జెలెన్ స్కీ కన్నీటి పర్యంతమయ్యా డు. మోదీని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆపై అమరవీరుల స్మారకాలను, బాంబుల వర్షంలో కన్నుమూసిన పసికందులు, చిన్నారుల మృతదేహాల ఫొటోలు చూపిస్తుండగా జెలెన్ స్కీ కళ్లు చెమర్చాయి. పక్కనే ఉన్న మోదీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మోదీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం, ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇంతటి పెద్ద సంక్షోభం నుంచి బయటపడేందుకు వారికి మనోధైర్యం ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్న’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ‘ఓయాసిస్ ఆఫ్ పీస్’ పార్క్‌లో ప్రతిష్ఠించిన మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ‘‘గాంధీ చూపించిన బాటలోనే నడుద్దాం. ఆయన ఆశయాలు విశ్వవ్యాప్తం. అహింస, శాంతి గాంధీజీ సిద్ధాంతాలు. కోట్లాది మందికి ఆయన స్ఫూర్తిదాయకం’’ అని మోదీ అన్నారు.
ఒక ఫ్రెండ్ మాదిరి రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించేందుకు నేను సిద్ధంగా ఉన్న. మనం సమయాన్ని వృథా చేయకుండా ఆ దిశలో పయనించాలి.
- ప్రధాని నరేంద్ర మోదీ