హెల్త్  కేర్ హబ్​గా వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ

హెల్త్  కేర్ హబ్​గా వారణాసి :  ప్రధాని నరేంద్ర మోదీ
  • కాశీలో ఆర్జే శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభించిన పీఎం 
  • బెంగాల్ లో ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన

వారణాసి:  యూపీలోని వారణాసి హెల్త్ కేర్ హబ్ గా మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆర్జే శంకర కంటి ఆస్పత్రిని ప్రధాని ఆదివారం  ప్రారంభించారు. కంచి మఠం నిర్వహించే ఈ హాస్పిటల్ తో తూర్పు యూపీలోని 20 జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇది దేశంలోనే 14వ పెద్ద హాస్పిటల్. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తూర్పు యూపీని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.

‘‘వారణాసి చాలా కాలం వరకు మతం, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఇప్పుడు హెల్త్ కేర్ హబ్ గా మారనుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండటంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత 10 ఏండ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు” అని తెలిపారు. వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని రూ.6.1 వేల కోట్ల  అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  

బెంగాల్ లో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టు విస్తరణ.. 

పశ్చిమ బెంగాల్ లోని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వారణాసి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కాగా, సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టు విస్తరణ పనులను  రూ. 1,550 కోట్లతో చేపట్టనున్నారు. మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగారూ. 6,700 కోట్లతో 23 ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయనుంది. అందులో భాగంగానే ఈ పనులకు పీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఎయిర్ పోర్టుకు ఏటా కోటి మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం  ఉందని అధికారులు తెలిపారు. 

నారీ శక్తి ఆశీర్వాదం  నాకు స్ఫూర్తినిస్తోంది

‘వికసిత్ భారత్’ కోసం కృషి చేసేలా ‘నారీ శక్తి’ ఆశీర్వాదం తనకు స్ఫూర్తినిస్తోందని ప్రధాని  నరేంద్ర మోదీ తెలిపారు. ఓ గిరిజన మహిళ రూ.100 తీసుకొచ్చి ప్రధాని మోదీకి ఇవ్వాలంటూ ఒడిశా బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాకి అందజేసింది. ‘ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు తెలపండి’ అని ఆమె కోరారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆయన ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.

ఈ పోస్టుకు నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ఈ ఆప్యాయత నన్ను కదిలిస్తోంది. నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్న నారీ శక్తికి నమస్కరిస్తున్నాను. వారి ఆశీస్సులు వికసిత్ భారత్‌‌ నిర్మాణానికి కృషి చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తాయి’’ అని వివరించారు.