- నాలెడ్జ్, స్కిల్స్ ను అందరితో పంచుకుంటున్నం
- ప్రపంచంలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంది
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నం
- ఆస్ట్రియాలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని స్పీచ్
వియన్నా: ప్రపంచానికి ఇండియా బుద్ధుడిని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వేల సంవత్సరాలుగా ఇండియా తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకుంటున్నదని తెలిపారు. ఇండియా ఎప్పుడూ శాంతి గురించి మాట్లాడుతుందని అన్నారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా బుధవారం వియన్నాలో నిర్వహించిన భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘‘ప్రపంచమంతా.. ఇండియాను ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నది. ఇది మనకు గర్వకారణం.
ఇండియా పేరు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నరు. నేను ఫస్ట్ టైమ్ ఆస్ట్రియాకు వచ్చాను. ఇక్కడి వాళ్లకు ఇండియా అంటే ఎంత ఇష్టమో చూస్తున్నాను. 41 ఏండ్ల తర్వాత ఇండియా ప్రధాని ఆస్ట్రియాకు వచ్చారు. ఇండియా, ఆస్ట్రియా మధ్య 75 ఏండ్ల నుంచి స్నేహం ఉంది. రెండు దేశాలను ప్రజాస్వామ్యం కలుపుతున్నది. స్వేచ్ఛ, సమానత్వం, చట్టాల పట్ల గౌరవం రెండు దేశాల్లో కనిపిస్తాయి.
ఇండియా ఎప్పుడూ శాంతి, శ్రేయస్సును కోరుకుంటుంది. అందుకే 21వ శతాబ్దంలో ఇండియా పాత్రను బలోపేతం చేసుకోబోతున్నాం’’అని అన్నారు. ఇండియాలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలను మోదీ గుర్తు చేశారు. 65 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. కొన్ని గంటల్లోనే ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఇది భారత ఎన్నికల యంత్రాంగం, ప్రజాస్వామ్యం శక్తి అని చాటి చెప్పారు.
తర్వలో మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా త్వరలోనే చేరుకుంటుందని మోదీ తెలిపారు. గత పదేండ్ల పాలనలో సాధించిన పురోగతిని మోదీ వివరించారు. కాగా, ఆస్ట్రియాలో 31వేల మందికిపైగా ఇండియన్స్ ఉన్నారు. ఆస్ట్రియాలోని ఇండియన్ కాన్సులేట్ ఆఫీస్ ప్రకారం.. 450 మందికి పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఆస్ట్రియాలో చదువుతున్నారు. కాగా, రెండ్రోజుల పాటు రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ గురువారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు.