- నోటిఫికేషన్ తేదీ నుంచే నామినేషన్లకు నిర్ణయం
- అగ్ర నేతలతో భారీ ర్యాలీలకు ప్లాన్
- ఈ నెల 10 నుంచి బూత్ సమ్మేళనాలు
- 15 నుంచి సెగ్మెంట్లవారీగా మీటింగ్‌లు
హైదరాబాద్, వెలుగు : మే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో మూడ్రోజులు పర్యటించేలా రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేస్తున్నది. జాతీయ అగ్రనేతలతో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే కింది స్థాయిలోని కార్యకర్తలు, నేతలనూ సమన్వయం చేసేందుకు సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ రెడీ చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు వచ్చే నెల 18న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. దీంతో అంతకు ముందే బూత్ లెవల్ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ లెవెల్ వరకూ ఉన్న ముఖ్యనేతలను ఎన్నికలకు సిద్ధం చేయాలని నిర్ణయించింది.
రెండ్రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పటేల్ సమక్షంలో రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం జరిగింది. దీంట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుమారు 5 వేల స్థానాల్లో టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు జరిగాయి. ఇది ఆయా ప్రాంతాల్లోని కేడర్‌లో ఒకింత ఉత్సాహాన్ని నింపింది. అయితే.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ చాలాచోట్ల ఈ కార్యక్రమం పెద్దగా జరగలేదు. దీనిపై ముఖ్యనేతలు సీరియస్ అయినట్టు తెలిసింది.
ఈ క్రమంలో మరోసారి కేడర్‌ను కలిసేలా ప్లాన్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంట్లో భాగంగా ఈనెల10 నుంచి14 వరకూ పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ బూత్ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల15 నుంచి18 వరకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమావేశాలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. వీటిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఎదుర్కొనేందుకు, కేంద్రంలో పదేండ్ల పాలనలో చేసిన కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని హైకమాండ్ ఆదేశాలిచ్చింది.