ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

హనుమకొండ, వెలుగు: హనుమకొండలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్​పీజీ డీఐజీ నవనీత్ కుమార్ మెహతా వరంగల్​ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 8న ప్రధాని పర్యటనను పురస్కరించుకొని మంగళవారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సీపీ ఏవీ. రంగనాథ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇతర ఉన్నతాధికారులతో నవనీత్​ కుమార్​ పరిశీలించారు. పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నందున బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు.  

భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాన్వాయ్‌కి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించి, ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. పబ్లిక్‌ కూర్చునేందుకు, పబ్లిక్‌ రావడానికి కావాల్సిన ఎంట్రీ పాయింట్లు  పక్కాగా ఉండాలన్నారు. తగినన్ని ఫైర్​ఇంజిన్లు,  వైద్య సిబ్బంది, అంబులెన్స్‌, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరగాలన్నారు.  గ్రేటర్​ కమిషనర్ రిజ్వాన్ బాషా, డీఆర్​వో వాసు చంద్ర, పరకాల ఆర్డీవో రాము, ఉన్నారు.