వరంగల్ టూర్ లో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. మామ్నూర్ నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి వచ్చిన మోదీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ఆవరణలోని గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు.
అనంతరం లోపలికి వెళ్లి భద్రకాళి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ రాకతో ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. భద్రత దృష్ట్యా భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. చిరుధాన్యలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఆరు రకాల ప్రసాదాలను అర్చకులు ప్రధానికి అందజేశారు.
మోదీ పర్యటన క్రమంలో వరంగల్ లో 3వేల 5వందల మంది పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. SPG, NSG బలగాల భద్రతా వలయంలో భద్రకాళి ఆలయం ఉంది. ఆలయంలో పూజల అనంతరం మోదీ కాకతీయ కాలేజి గ్రౌండ్ కు చేరుకుని అక్కడ రూ. 6 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనల అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.