- మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్‌కు ప్రధాని
- రూ.13,545 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
- అనంతరం సభలో ప్రసంగించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మహబూబ్‌నగర్ వేదికగా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ‘పాలమూరు ప్రజా గర్జన’ పేరుతో భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో మోదీ మాట్లాడనున్నారు.
ముందుగా రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత సభలో పాల్గొననున్నారు. సభా వేదికగా తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటించే అవకాశం ఉందా..? సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతారా..? బీఆర్ఎస్ సర్కార్ తీరుపై ప్రశ్నించనున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
భారీ ఏర్పాట్లు
మోదీ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోదీ పాల్గొనే సభ వద్ద, సభకు వెళ్లే అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మోదీ కౌటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కాషాయ తోరణాలు కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణం వద్ద మోదీ భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మోదీ టూర్ సాగేదిలా
ఆదివారం (అక్టోబర్ 1న) మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2.10 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు హెలికాప్టర్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
కేసీఆర్ దూరం.. స్వాగతం పలకనున్న తలసాని
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్నారు. మోదీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్మరోసారి దూరంగా ఉన్నారు. కరోనా ఫస్ట్వేవ్తర్వాత ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కేసీఆర్ఆయనకు స్వాగతం పలకడం లేదు. ఈసారి కూడా అదే విధంగా దూరంగా ఉంటున్నారు. సీఎం వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్నారని కొన్ని రోజుల కింద మంత్రి కేటీఆర్ట్వీట్ చేశారు.