-
కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవ ఏర్పాట్లు
-
ప్యాసింజర్ రైలు నడపాలంటున్న ప్రజలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్ నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను ప్రధాని నరేంద్రమోడీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి నుంచే వర్చువల్గా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడున్నరేండ్లలో సింగరేణి సాయంతో ఈ లైన్‌ను పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బొగ్గు లారీలతో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
రూ. 930కోట్లు..54.10 కిలోమీటర్లు..
సింగరేణిలో పెద్ద ఓపెన్ కాస్టు గనుల్లో సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ ఒకటి. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు రవాణా చేస్తుంది. సత్తుపల్లిలోని మైన్స్ నుంచి బొగ్గును లారీల ద్వారా కొత్తగూడెం తీసుకొచ్చి అక్కడి నుంచి రవాణా చేసేవారు. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు బొగ్గు లారీలతో పలు ప్రాంతాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో ఇటీవలి కాలంలో బొగ్గు లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో పాటు దాదాపు 10 మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ వరకు రైల్వే లైన్‌కు సింగరేణి సంస్థ పంపిన ప్రపోజల్స్‌కు 2010లో రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పనులు మాత్రం మూడున్నరేండ్ల కింద ప్రారంభమయ్యాయి.
రూ. 930 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ రైల్వే లైన్‌కు రూ. 619 కోట్లు సింగరేణి ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని రైల్వే శాఖ భరించింది. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 3 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో పది మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్ వోబీలను నిర్మించారు.
ప్రస్తుతం ఈ మార్గం నుంచి బొగ్గు రవాణా జరుగుతోంది. ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు రేక్‌ల వరకు బొగ్గు రవాణా చేస్తున్నారు. రైల్వే లైన్‌ను ప్రధాని వర్చువల్ గాప్రారంభించేందుకు కొత్తగూడెం రైల్వే స్టేష న్ లో శిలాఫలకంతో పాటు సభా వేదిక
ఏర్పాట్లను రైల్వే అధికారులు చేపట్టారు. మంత్రి పు వ్వాడ అజయ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతారని రైల్వే ఆఫీసర్లు తెలిపారు.
కొవ్వూరు వరకు పొడిగించాలె..
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి సత్తుపల్లి వరకు ఉన్న రైల్వే లైన్‌ను కొవ్వూరు వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కొత్త గూడెం నుంచి సత్తుపల్లి వరకు ప్యాసిం జర్ రైలు నడపాలనే డిమాండ్ ఉంది.