మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ
అవయవ దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి
సోలార్ ఎనర్జీ రంగంలో దేశం వేగంగా ఎదుగుతున్నదని కామెంట్
న్యూఢిల్లీ : రంజాన్ సహా పలు పండుగల సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కొన్ని చోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఫెస్టివ్ సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆదివారం 99వ మన్ కీ బాత్ ఎడిషన్‌లో ప్రధాని మాట్లాడారు. ‘‘పండుగలు జరుపుకోండి.. కానీ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి” అని కోరారు. అవయవ దానం చేయాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో యూనిఫామ్ పాలసీ తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అవయవ దానం చేసిన వాళ్లు.. వాటిని అందుకున్న వాళ్లకు దేవుళ్లతో సమానమని, ఆర్గాన్ డొనేషన్ వల్ల మరిన్ని ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. దేశంలో అవవయ దానంపై అవగాహన పెరుగుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. అవయవాలను దానం చేసేందుకు 65 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉండాలనే నిబంధనను తొలగించినట్లు తెలిపారు. ‘‘2013లో 5 వేల కంటే తక్కువ ఆర్గాన్ డొనేషన్స్ నమోదు కాగా.. 2022 నాటికి ఇవి 15 వేలకు పెరిగాయి. ఒక వ్యక్తి చేసే అవయవ దానం ద్వారా.. 8 నుంచి 9 మందికి సాయపడొచ్చు” అని తెలిపారు. అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులతో ప్రధాని మాట్లాడారు. మరోవైపు, మన్ కీ బాత్ 100వ ఎడిషన్‌కు ఐడియాలు ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇండియా బలోపేతంలో మహిళా శక్తి
‘‘సౌరశక్తి రంగంలో భారతదేశం వేగంగా ముందు కు సాగుతున్నది. ఇది పెద్ద విజయం. దేశంలో రోజు వారీ విద్యుత్ అవసరాలకు క్లీన్ ఎనర్జీని మాత్రమే వినియోగిస్తున్న తొలి జిల్లాగా ‘డయ్యూ’ నిలిచింది” అని ప్రధాని చెప్పారు. భారతదేశం బలోపేతంలో మహిళా శక్తి పెద్ద పాత్ర పోషిస్తోందని చెప్పారు. ‘‘ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్‌గా సురేఖ యాదవ్ గుర్తింపు పొందారు. నిర్మాత గునీత్ మోంగా, దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ తమ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ద్వారా దేశానికి గొప్ప కీర్తిని తెచ్చారు. టర్కీలో రెస్క్యూ ఆపరేషన్స్‌లో మహిళలు కీలక పాత్ర పోషించారు” అని ప్రశంసించారు. కాశ్మీర్ కమలానికి విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని, లావెండర్ పూలు పెంచడం ప్రారంభించిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని భదర్వాలో రైతుల ఆదాయం పెరిగిందని చెప్పారు.'