రూ.18 వేల కోట్ల రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? : మంత్రి తుమ్మల

 రూ.18 వేల కోట్ల రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? : మంత్రి తుమ్మల
  • రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని వ్యాఖ్యలు సరికాదు: మంత్రి తుమ్మల
  • దసరా తర్వాత 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులపై సమీక్ష
  • రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగానే రైతు భరోసా ఇస్తం
  • ప్రతిపక్షాల్లోనే ఆందోళన తప్ప.. ప్రజల్లో లేదని కామెంట్
  • గాంధీ భవన్​లో మంత్రులతో ముఖాముఖిలో తుమ్మల
  • మొత్తం 95 అర్జీలు స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇది ప్రధాని మోదీకి, బీజేపీకి కనిపించడం లేదా? అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు  ప్రశ్నించారు. 2 రోజుల క్రితం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్ లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.  వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ వర్గాల నుంచి మొత్తం 95 దరఖాస్తులు రాగా, మంత్రి స్వీకరించారు. ఇందులో భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇండ్లలాంటి అర్జీలే ఎక్కువగా ఉన్నాయి.  

అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేస్తున్నారా? అని మోదీని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రైతులను బీఆర్ఎస్  మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఇవ్వని రైతు బంధును కూడా తమ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. 

రుణమాఫీ విషయంలో రైతులు ఎవరూ కూడ ఆందోళనలో లేరని,  అధికారం కోల్పోయిన వాళ్లు, అధికారంలోకి రావాలనుకునే వాళ్లలోనే ఆందోళన ఉన్నదని  బీఆర్ఎస్, బీజేపీని పరోక్షంగా విమర్శించారు. ఈ రెండు పార్టీల రైతు వ్యతిరేక చర్యలను ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. తాము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే తమకు నిరసన సెగ తగిలేది కదా? అని అన్నారు. రుణమాఫీ విషయంలో తెలంగాణ లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించాలని సవాల్​ చేశారు. 

22 లక్షల మందికి రుణమాఫీ చేశాం

పది నెలల కాలంలోనే ఇప్పటి వరకూ  22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, ఇంకో 20 లక్షల మంది రైతులకు చేయాల్సి ఉన్నదని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం ఇంకా 9 లక్షల కుటుంబాలకు  రుణమాఫీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. రూ. 2 లక్షల పైన రుణం ఉన్న  రైతుల రుణమాఫీపై దసరా తర్వాత సమీక్ష చేస్తామని, వాటిని కూడా మాఫీ చేస్తామని తెలిపారు.  బాధ్యతలు చేపట్టిన వెంటనే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టడం బాగుందని అన్నారు.

 గాంధీ భవన్ లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతోనే ప్రజలు గాంధీ భవన్ కు వస్తు న్నారని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ప్రజావాణి కార్యక్రమంలో కూడా ప్రజల నుంచి విజ్ఞ ప్తులు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజా పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

 కాగా, మం త్రులతో ముఖాముఖిలో భాగంగా తుమ్మలను గ్రూప్​-4 పరీక్ష రాసిన అభ్యర్థులు కలిసి, తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో మంత్రి అప్పటికప్పుడు  టీజీపీఎస్సీ చైర్మన్  మహేందర్ రెడ్డితో ఫోన్ లో  మాట్లాడి, ఆ సమస్య పరిష్కారంపై చొరవచూపారు. దీనిపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు తనకున్న భూ వివాదంపై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి  ఆ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి, సమస్యను పరిష్కరించాలని కోరారు.