అహ్మదాబాద్: మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన లెటర్లు, కీలక డాక్యుమెంట్లు వెంటనే తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) లేఖ రాసింది. లెటర్లు ఇచ్చేయాలని సెప్టెంబర్‌లోనే సోనియా గాంధీకి మెయిల్ పంపించామని ఈ లేఖలో పీఎంఎంఎల్ గుర్తుచేసింది. అయితే, ఇప్పటివరకు సోనియా స్పందించలేదని చెప్పింది.
ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలకు, నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయని తెలిపింది. 2008లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ లేఖలతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లను 51 బాక్సుల్లో నింపి తీసుకెళ్లిపోయారని వివరించింది. అప్పటి నుంచి అవి ప్రైవేట్ ప్లేస్‌లో స్టోర్ చేసినట్లు పీఎంఎంఎల్ తెలిపింది.
స్కాలర్స్, రీసెర్చర్లకు లెటర్లు ఉపయోగపడ్తయ్
ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ ఢిల్లీలో ఉంది. పీఎంఎంల్ మండలిలో సభ్యుడు, అహ్మదాబాద్‌కు చెందిన రిజ్వాన్ ఖాద్రీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ ప్రధాని నెహ్రూ.. ఎంతోమంది ప్రముఖులకు లేఖలు రాశారు. కొందరు ఆయనకు లేఖల ద్వారా రిప్లై కూడా ఇచ్చారు. ఆ లెటర్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపర్చారు. ఇప్పుడు దాన్నే ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ లైబ్రరీ(పీఎంఎంఎల్) అని పిలుస్తున్నం. 2008లో సోనియా గాంధీ ఆదేశాల మేరకు నెహ్రూకు సంబంధించిన లేఖలు, డాక్యుమెంట్లను ప్రైవేట్ ప్లేస్‌కు తీసుకెళ్లిపోయారు. అవన్నీ మన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
కీలక డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసి మ్యూజియంలో పెడ్తున్నం. లెటర్లు ఇవ్వాలని సోనియాను కోరినా స్పందించలేదు. అందుకే రాహుల్‌కు మళ్లీ లేఖ రాశాం. ఒరిజినల్ లేఖలు ఇవ్వలేకపోతే.. వాటి స్కాన్ కాపీలైనా సబ్మిట్ చేయాలని సూచించినం. లేఖలు స్కాలర్స్, రీసెర్చర్లకు అందుబాటులో ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నెహ్రూ, అప్పటి నేతల మధ్య ఉత్తరాల్లో ఏం చర్చ జరిగిందనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మేము చేసిన రిక్వెస్ట్‌పై గాంధీ ఫ్యామిలీ స్పందిస్తుందని భావిస్తున్నం’’ అని రిజ్వాన్ ఖాద్రీ తెలిపారు. కాగా, 29 మంది సభ్యులతో కూడిన పీఎంఎంఎల్ సొసైటీకి హెడ్‌గా ప్రధాని మోదీ ఉన్నారు. కాగా, లెటర్లు తిరిగి రప్పించుకునేందుకు అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సొసైటీ భావిస్తున్నది.
లెటర్లలో ఏముందో తెలియాలి: బీజేపీ
ఎడ్విన్ మౌంట్బాటెన్కు నెహ్రూ రాసిన లేఖలో ఏం ఉందో దేశ ప్రజలకు తెలియాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ప్రధానమంత్రుల మ్యూజియం నుంచి సోనియా గాంధీ తీసుకెళ్లిన లెటర్లు, డాక్యుమెంట్లు వెంటనే సొసైటీకి అప్పగించాలని కోరుతున్నది. కీలక డాక్యుమెంట్లన్నింటినీ డిజిటలైజ్ చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారని, మరి ఈ లేఖలు డిజిటలైజ్ అవ్వకుండా సోనియా గాంధీ ఎందుకు అడ్డుపడ్డారని బీజేపీ ప్రశ్నించింది.