వికారాబాద్ / కొడంగల్, వెలుగు: వికారాబాద్‌జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఇతర అధికారులపై సోమవారం జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త సురేశ్ పరారీలో ఉన్నాడు. సురేశ్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు.
కాల్ డేటాలో విస్తుపోయే నిజాలు
కలెక్టర్, అధికారులపై దాడి జరగడానికి ప్రథమ కారణం సురేశ్ అని తెలుసుకున్న పోలీసులు అతడి ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. అతడు ఎవరెవరితో మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడాడు? ఎక్కువ సార్లు ఎవరికి ఫోన్ చేశాడు? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డట్టు సమాచారం. కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి ముందు సురేశ్.. బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేతో 42 సార్లు ఫోన్మాట్లాడినట్టు గుర్తించారు. నరేందర్‌రెడ్డి.. సురేశ్‌ను లైన్లో ఉంచి ఆ పార్టీ ముఖ్య నేతతో 6 సార్లు ఫోన్ మాట్లాడినట్టు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :- ఎస్పీ ఆధ్వర్యంలో పట్నం నరేందర్ రెడ్డి విచారణ
పరారీలో సురేశ్.. 16 మంది అరెస్ట్
దాడి జరిగిన తర్వాత అలర్టయిన పోలీసులు లగచర్ల గ్రామంలో 28 మందిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. అప్పటికే సురేశ్‌తో పాటు మరికొందరు గ్రామం నుంచి పరారైనట్టు గుర్తించారు. విచారణ తర్వాత 12 మందిని వదిలేసి.. 16 మందికి పరిగి ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్ది తెలిపారు. ప్రధాన నిందితుడు సురేశ్ కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయని, అతడు దొరకగానే ఇంకా ఎవరెవరు దీని వెనక ఉన్నారనే విషయం తెలుస్తుందని, అందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు.