ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో శివ శేషు తెరకెక్కించిన చిత్రం ‘కలి’. కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ నిర్మించగా శివ శేషు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన కలి మూవీ ఇవాళ శుక్రవారం అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైంది. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే::
శివరామ్(ప్రిన్స్) యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. నిస్వార్ధంగా ఉంటూ ఎవరికైనా ఆపద వస్తే సాయం చేసే గుణం చూసి అతడిని ప్రేమించి వేద(నేహా కృష్ణన్) పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొంటుంది. ఇక శివరామ్ మంచితనం వల్ల అందరూ అతన్ని మోసం చేస్తారు. దాంతో ఆస్తులన్నీ పోగొట్టుకొంటాడు. చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్‌కు ప్రయత్నిస్తాడు. అంతేకాకకుండా ఇష్టపడి పెళ్లి చేసుకున్న తన భార్య కూడా అతన్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. శివరామ్ ఉరి వేసుకునే సమయానికే.. కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత శివరాం, కలి మధ్య నడిచిన గేమ్ ఏంటి? కలి పురుషుడు ఎందుకు శివరామ్ దగ్గరికి వచ్చాడు? శివరామ్ కు అసలు ఎదురైన కష్టాలు ఏమిటి? శివరామ్ సూసైడ్ చేసుకున్నాడా? శివరామ్ ని వదిలి వెళ్లిన తన భార్య వేద మళ్ళీ వస్తుందా? లేదా? అసలు శివరామ్ కోసం కలి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? తదితర విషయాలు తెలియాలంటే కలి సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే::
మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆత్మహత్యలు వద్దనే ఒక మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘కలి’. పురాణాల్లోని కలి పురుషుడి పాత్ర స్ఫూర్తితో తీసిన ఫిక్షన్ మూవీ ఇది. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు అనే సందేశాన్ని ఈ మూవీలో అంతర్లీనంగా చూపించారు డైరెక్టర్ శివ శేషు.
ఇందులో అతి మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మహత్యకు సిద్ధమైన శివరామ్ అనే పాత్రలో ప్రిన్స్ నటించాడు. అతని ఇంటికి వచ్చే అపరిచిత వ్యక్తిగా నరేష్ అగస్త్య కనిపిస్తాడు. ఇక ఈ రెండు పాత్రల మధ్య జరిగే కథ అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ నేహా కృష్ణన్ తో లవ్ స్టోరీ కూడా సినిమాకు ప్లస్ అయింది.
సినిమా ఫస్టాఫ్ లో నాలుగు యుగాల గురించి సీన్, సినిమా మధ్యలో కలి నివాసం సీన్ చాలా ఆసక్తిగా ఉంటాయి. ఐతే, కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనే ఫీలింగ్ కలిగిస్తోంది. ఐతే ఆడియన్ చూస్తున్నంతసేపు ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా స్క్రీన్ ప్లే ఉండటంతో బోర్ కొట్టదు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. బల్లి పాత్రకు ప్రియదర్శి వాయిస్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నిడివి గంటన్నరే ఉండడం కలికి కలిసొచ్చింది.
ఎవరెలా చేశారంటే::
ఆత్మహత్యకు సిద్ధమైన శివరామ్ అనే పాత్రలో ప్రిన్స్ బాగా నటించాడు. అతని ఇంటికి వచ్చే అపరిచిత వ్యక్తిగా నరేష్ అగస్త్య కనిపించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వేదగా చేసిన నేహాకృష్ణ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు::
గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంశాలు సినిమాను రిచ్‌గా మార్చాయి. జీవన్ బాబు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ విజయ్ పనితనం ఓకే. నిశాంత్ కొటారి, రమణ జాగర్లమూడి సినిమాటోగ్రఫి సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. కలి పాత్ర, కలి నివాసం డిజైన్ ప్రేక్షకులని మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా కావాల్సినంత బాగానే ఖర్చు పెట్టి తీశారు నిర్మాతలు. ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ సినిమాతో డైరెక్టర్ ఎంట్రీ బాగుంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.
Note: ఏదేమైనా జీవితంలో పోరాడాలి. అది కష్టమైనా, నష్టమైనా.. సూసైడ్ చేసుకోవడం ఒక్కటే సమాధానం ఐతే కాదు. అది మిగతా కుటంబసభ్యులకు మిగిల్చిపోయే కన్నీరు మాత్రమే అవుతుంది.