యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి దివంగత నిజాం ముకర్రం జా సతీమణి, యువరాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ భారీ విరాళం అందజేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు రూ.5లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళం ఇచ్చారు. యువరాణి ఎస్రా తరపున.. యాదాద్రి ఆలయ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి కిషన్ రావు.. నగలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీతకు అందించారు.
లండన్‌లో నివసిస్తున్న యువరాణి ఎస్రా తరచుగా హైదరాబాద్‌కు, ఆమె స్వదేశమైన టర్కీకి వెళుతూ ఉంటుంది. అయితే.. యువరాణి ఎస్రాతో కొన్నేళ్ల క్రితం ఆలయ పునర్నిర్మాణ ప్రాజెక్టు గురించి చర్చించినప్పుడు.. ఆమె ఆలయాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపించారు. గతేడాది ప్రారంభంలో ఆలయం తిరిగి తెరిచిన తర్వాత మీడియాలో ఆలయ చిత్రాలు, వీడియోలు వైరల్ కావడంతో.. అవి చూసిన ఆమె ఆలయానికి విరాళం ఇవ్వాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ఆలయ అధికారులకు కిషన్ రావుతో బంగారు ఆభరణాలను పంపించారు. అంతకుముందు యువరాణి ఎస్రా యాదాద్రి ఆలయాన్ని సందర్శించాలని భావించారు. కాని అదే సమయంలో ముకర్రం జా మరణించడంతో ఆమె ఆలయ సందర్శనకు రాలేదు. ఇక యాద్రాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.