ఖమ్మం జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు

గురువులు సరస్వతి స్వరూపం అంటారు. లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులైతే.. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేది గురువులే. ఆ గురువులు చెప్పే ప్రతి మాట జీవిత సత్యంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకే అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి అలాంటి స్థానంలో ఉన్న ఓ గురువు కీచకుడిగా మారాడు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రామారావు.. స్కూల్లోని విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి. తాకరాని చోట చేతులు వేస్తూ.. విద్యార్థినీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొందరు బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడు రామారావును నిలదీశారు. అతడు చెప్పే సమాధానాలు పొంతన లేకపోవడంతో ఆగ్రహంతో రామారావును గ్రామంలోనే నిర్బంధించి దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ ఇష్యూపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, ప్రధానోపాధ్యాయుడు రామారావు తప్పు ఉందని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. రామారావును పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు గాంధీ సినిమాను థియేటర్ లో చూపిస్తున్న సమయంలో అక్కడ కూడా కొంతమంది విద్యార్థినీల పట్ల ప్రధానోపాధ్యాయుడు రామారావు అసభ్యంగా ప్రవర్తించాడని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.