కొత్త ఎస్ హెచ్​జీల ఏర్పాటుపై దృష్టి పెట్టండి : దాన కిషోర్

  • అర్హత గల ప్రతి మహిళకూ సభ్యత్వం కల్పించాలి 

హైదరాబాద్, వెలుగు: కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశించారు. ఇప్పటి వరకు సంఘాల్లో సభ్యత్వం లేని అర్హులైన మహిళలను గుర్తించి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. శనివారం మాసబ్ ట్యాంక్​లోని ఎంఏయూడీ కార్యాలయంలో ఆయన జీహెచ్ఎంసీ, మెప్మా అధికారులతో హెచ్ జీల బ్యాంకు లింకేజీ టార్గెట్, లక్ష్యసాధన, కొత్త గ్రూపుల ఏర్పాటు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కార్యకలాపాల అభివృద్ధి తదితరాలపై రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు పాత సంఘాల బలోపేతానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మహిళలు సంఘాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించి కొత్త ఎస్​హెచ్​జీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, జీహెచ్ఎంసీ పీడీలు, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ నిర్వహించాలన్నారు. వచ్చే నెల చివరి నాటికి కొత్త గ్రూపులను ఏర్పాటు చేసి కొత్త సభ్యుల నమోదు పూర్తి చేయాలన్నారు. 

కొత్త గ్రూపులను ఏరియా లెవల్ ఫెడరేషన్లు, టౌన్ ఫెడరేషన్లకు అటాచ్ చేయాలన్నారు. సంఘాలకు నిర్దేశిత లక్ష్యాల మేరకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. జీహెచ్ఎంసీ బ్యాంకు లింకేజీ ద్వారా నెలకు కనీసం రూ.200 కోట్ల రుణాలు అందించాలన్నారు. మెచ్యూరిటీ ఎస్ హెచ్ గ్రూపులలో బిజినెస్ ఓరియంటేషన్ తీసుకురావాలని, మహిళలను వ్యాపారాల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు.