- కొత్త ఎస్ హెచ్ జీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టండి: దాన కిశోర్
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు. క్లియర్ పట్టా ఉండి, అనుమతులు లేని లే ఔవుట్ లను క్రమబద్ధీకరణ చేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి నెల చివరికల్లా ఈ ప్రక్రియను పూర్తిచేసి.. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
గురువారం ఎంసీహెచ్ ఆర్డీఏలో 142 మంది మున్సిపల్ కమిషనర్లతో దాన కిశోర్, సీడీఎంఏ టీకే శ్రీదేవి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు, కొత్త ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో రెవిన్యూ జనరేషన్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు, భువన సర్వే, మెప్మా కార్యకలపాల ప్రగతి తదితర అంశాలపై కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు.
మున్సిపాలిటీల్లో కొత్త ఎస్‌హెచ్‌జీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అర్హత కలిగిన ప్రతి మహిళ గ్రూపులో చేరేలా కమిషనర్లు అవగాహన కల్పించాలని దాన కిశోర్ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్లాంట్ల టెండర్లను త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో మెప్మా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టణాల పరిధిలోని ఖాళీ స్థలాలు, వాటర్ ట్యాంక్ లపై ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలన్నారు. టీకే శ్రీదేవి మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లకు కమిషనర్లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.