- ఎస్సీ, ఎస్టీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చేలా సీఎం రేవంత్ కసరత్తు
- నెలాఖరులోపు ఆర్డర్లు అందజేసే అవకాశం
- పార్టీ నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
హైదరాబాద్, వెలుగు: త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల్లోయువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ముందుగా అన్ని సామాజిక వర్గాలు, సీనియర్లతో పాటు కీలక సమయంలో కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నేతలకు అవకాశం ఇచ్చేలా ఆయన జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే, యువత, మహిళలకు కొంత ప్రాధాన్యం ఉండేలా చూడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ సీఎం రేవంత్‌కు సూచించినట్టు సమాచారం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక సమతుల్యత పాటించాలని కూడా వారు కోరినట్టు తెలిసింది. దీంతో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని నామినేటెడ్ పదవులను ప్రకటించడంపై సీఎం రేవంత్ దృష్టి సారించినట్టు సమాచారం.
అన్ని వర్గాలకు న్యాయం చేసే యోచనలో సీఎం
నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా నారాజ్ చేయకుండా, పార్టీ క్యాడర్‌కు న్యాయం చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. పార్టీలో మొదటి నుంచి ఉండి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన నేతలకు, తన పిలుపుతో కీలక సమయంలో పార్టీలోకి వచ్చిన వలస నేతలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. నేతల స్థాయి, పార్టీకి వారు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఆయా జిల్లాల నేతలకు సంబంధిత జిల్లా మంత్రులు చేసిన సిఫారసులు, పార్టీ తరఫున వచ్చిన రెకమెండేషన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ పదవి ఇవ్వాలని నిర్ణయించి రేవంత్ లిస్టును సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
కీలక పదవులపై పలువురి దృష్టి
నామినేటెడ్ పదవుల్లో కొందరి దృష్టి ఆర్టీసీ, సివిల్ సప్లయ్స్, రెడ్కో, హుడా, మూసీ రివర్ ఫ్రంట్ వంటి కీలక పదవులపై పడింది. అయితే, ఈ పదవులకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించి.. వాటిని సీనియర్లతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన 37 మందితో కూడిన జాబితాలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసి.. అదనంగా మరో 17 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించనున్నట్టు తెలిసింది. మొత్తం 54 మందికి ఈ నెలాఖరులోపు ఆర్డర్లు అందజేయాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతకాలం పార్టీ కోసం పనిచేసి, నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వందలాది మంది కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు.