(నేడు 25వేల మంది టీచర్లతో సీఎం సమావేశం సందర్భంగా..)
కొఠారి విద్యాకమిషన్ సిఫార్సులను భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మనదేశ విద్యావ్యవస్థకు ఈ పీఠిక ఆత్మలాంటిది. గత పదేండ్ల కాలంలో తెలంగాణలో ఉపాధ్యాయులు లేక తరగతి గది అభ్యసన సంక్షోభం ఎదుర్కొంటోంది. విద్యాపాలనకు అధికారులు లేక, పర్యవేక్షకులు లేక బోధన సంక్షోభంతో పాఠశాల విద్య చిన్నాభిన్నమైంది. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల విశ్వాసం పొందలేకపోతున్నాయి.
ప్రైవేటు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు ఉండడంతో మూడు ఏండ్ల వయసున్న పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేరుస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేసి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.
రా ష్ట్రంలోని విద్యార్థుల్లో 43.64 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 56.36 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. నేషనల్ అచీవ్ మెంట్ సర్వే , అసర్ సర్వే , ఎస్సీఈఆర్టీ సర్వేలు విద్యా ప్రమాణాలలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 27వ స్థానంలో ఉందని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యారంగాన్ని మామూలు స్థితికి తేవడానికి , తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలిగించడానికి కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించాలి.
అకడమిక్ అథారిటీ - ఎస్సీఈఆర్టీ :-
విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్రంలో విద్యను పర్యవేక్షిస్తూ సూచనలు చేసే అకడమిక్ అథారిటీ ఎస్సీఈఆర్టీ. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ అందించడం, విద్యా లక్ష్యాలు, బోధన విధానాలు, విద్యాప్రణాళిక రూపకల్పన చేయడం, పాఠ్యపుస్తకాలు రచించడం, నూతన మూల్యాంకనంపై పరిశోధనలు చేయడం వంటి బాధ్యతలు నిర్వహించే ఎస్సీఈఆర్టీని ప్రభుత్వం పటిష్టం చేయాలి.
ఏజెన్సీ పాఠశాలలు:-
గిరిజన సంక్షేమశాఖ నేరుగా నిర్వహించే 1,777 పాఠశాలల్లో 92,480 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్ళను పూర్తిస్థాయి ఆశ్రమ పాఠశాలలుగా 2013లో మార్చారు. కానీ, కావలసిన పోస్టులను మంజూరు చేయలేదు. ఈ పాఠశాలలను విద్యాశాఖ పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకుని, అక్కడ ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి.
ఎయిడెడ్ పాఠశాలలు:-
ప్రభుత్వం నిధులు సమకూరుస్తూ ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహించే ఎయిడెడ్ పాఠశాలలు సుమారు 20 ఏండ్ల నుంచి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో, ఉపాధ్యాయుల కొరతతో అనేక పాఠశాలలు మూతపడ్డాయి. కనుక ప్రభుత్వం ఈ పాఠశాలలను స్వాధీనం చేసుకొని ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి.
సింగరేణి పాఠశాలలు :
సింగరేణి కాలరీస్ లో పనిచేసే కార్మికులు ఉద్యోగుల పిల్లలకు మెరుగైన విద్యను అందించడం కోసం 1975-–76 విద్యాసంవత్సరంలో సింగరేణి యాజమాన్యం 17 విద్యాసంస్థలను ప్రారంభించింది. ప్రస్తుతం సీబీఎస్ఇ సిలబస్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్న సింగరేణి యాజమాన్యం ఉపాధ్యాయ నియామకాలను చేసి తన ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే చర్యలు తీసుకోవాలి.
ఆదర్శ పాఠశాలలు:-
రాష్ట్రంలో194 ఆదర్శ పాఠశాలుండగా.. వీటిలో 1,21,346 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలల్లో 3,880 బోధన పోస్టులుండగా, ప్రస్తుతం 2,827 మంది పనిచేస్తున్నారు.1,053 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక అవసరాల మేరకు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేయడంతో పాటు, అవసరాల మేరకు కొత్త ఉపాధ్యాయులను , బోధనేతర సిబ్బందిని, హాస్టళ్లకు ప్రత్యేకంగా వార్డెన్ లను నియమించాలి.
కేజీబీవీ పాఠశాలలు:-
సమగ్ర శిక్షా అభియాన్ నిర్వహణలో డ్రాపౌట్ బాలికల కోసం రాష్ట్రంలో 475 కేజీబీవీ పాఠశాలలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశించిన సమాన పనికి సమానవేతనం వర్తింపజేయకపోవడం గమనార్హం! వీరందరినీ రెగ్యులర్ స్కేల్ లో నియమిస్తూ, గురుకుల ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు కల్పించాలి. హాస్టళ్లకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలి. బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి.
డే కేర్ పాఠశాలలుగా ప్రభుత్వ పాఠశాలలు:-
అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలు జరుగుతున్నప్పటికీ చాలా నిర్వహణ లోపాలున్నాయి. దీనికి తోడుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున ఈ ఏజెన్సీ నిర్వాహకులకు అడ్వాన్సుగా బిల్లులను చెల్లించాలి. వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచి ప్రతినెలా చెల్లించాలి.
పాఠశాలల పర్యవేక్షణ:-
30,178 ప్రభుత్వ పాఠశాలల్లో, 10,478 ప్రైవేట్ పాఠశాలల్లో బోధనా ప్రక్రియ మూల్యాంకనం చేయడం, పాఠశాలల పర్యవేక్షణ చేయడానికి మండల స్థాయిలో 602 మండలాలకు 20 రెగ్యులర్ ఎంఇఓలు ఉండగా 580 మండల విద్యాధికారి ఖాళీలను, డివిజన్ స్థాయిలో 66 పోస్టులకుగాను 60 డిప్యూటీ విద్యాధికారి ఖాళీలను, జిల్లా స్థాయిలో 26 డిఇవో పోస్టులను భర్తీ చేయాలి.
గురుకుల పాఠశాలలు
రాష్ట్రంలో వివిధశాఖల నిర్వహణలో ఆరు రకాల గురుకుల విద్యాలయ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల అధీనంలో 1,002 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన 700 పైగా ఉన్న గురుకులాలకు శాశ్వత భవనాలను నిర్మించడానికి కావలసిన స్థలాలను, బడ్జెట్ కేటాయించాలి. ఈ గురుకులాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, తాత్కాలిక పద్ధతులలో పనిచేస్తున్నారు. వీరందరిని రెగ్యులరైజ్ చేయాలి. ఒకే డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి.
విద్యారంగానికి నిధుల కేటాయింపు పెంచాలి
రాష్ట్రంలో విద్యారంగానికి నిధుల కేటాయింపు 7.31% గా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు కేటాయించిన బడ్జెట్ 11 శాతంగా ఉండేది. డాక్టర్ కొఠారి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని సూచించారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించే నిధులను పెంచాలి.
- కె. వేణుగోపాల్, పూర్వ అధ్యక్షుడు, ఏపీటీఎఫ్
- బి.కొండల్ రెడ్డి, పూర్వ అధ్యక్షుడు, టీపీటీఎఫ్