
ఆమనగల్లు, వెలుగు: పార్టీ కోసం పని చేసే వారికే స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని ఏఐసీసీ కార్యదర్శి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వంశీచంద్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొన్ని మతతత్వ శక్తులు అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని తెలిపారు.
అలాంటి వారికి సర్వ మతాలు సమానమని వివరించేందుకు, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకే యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పదేండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకపోగా, ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. వారి అసత్య ప్రచారాన్ని ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని కోరారు.
గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందేండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న యాత్రలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని భరోసా కల్పించాలని కోరారు. జిల్లా కో ఆర్డినేటర్ జైపాల్, ఇన్చార్జీలు జంగారెడ్డి, శివకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ పాల్గొన్నారు.