హైదరాబాద్, వెలుగు: హరితహారం చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ శాఖ స్వరూపాన్నే మర్చేశామని చెప్పారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమమన్నారు. గతంలో ఆదర్శ గ్రామం అంటే వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి గుర్తొచ్చేదని.. ఇప్పుడు ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. శుక్రవారం శాసనమండలిలో పల్లె ప్రగతిపై షార్ట్ డిస్కషన్ జరిగింది. బీజేపీ నేత రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్ సభ్యుడు కర్నె ప్రభాకర్, గంగాధర్‌గౌడ్, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, ఎంఐఎం మెంబర్ జాఫ్రీ మాట్లాడారు.
దాతలను ప్రోత్సహించాలి
గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చే దాతలను ప్రోత్సహించాలని ఎర్రబెల్లి కోరారు. దాతల ప్రోత్సాహంతో సత్తుపల్లిలో వైకుంఠధామం నిర్మించామని చెప్పారు. దమ్మన్నపేటలో ఒకే వ్యక్తి రూ.25 కోట్లు గ్రామ అభివృద్ధికి అందించారని తెలిపారు. ప్రజాప్రతినిధులు చొరవ చూపితే ఆయా గ్రామాల్లో పుట్టిన వారు సాయం చేసేందుకు ముందుకు వస్తారని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలనే సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చామని తెలిపారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు భారీగా పెంచామన్నారు. ట్రాక్టర్లు అందని 420 గ్రామాలకు త్వరలోనే ట్రాక్టర్లు అందిస్తామని ప్రకటించారు.
పల్లె ప్రగతిని కంటిన్యూ చేయాలి: రాంచందర్‌రావు
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కోరారు. కొత్తలో హడావుడి చేసి, తర్వాత వదిలేయొద్దన్నారు. గతంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి హడావుడి చేశారని, ఇప్పుడది పత్తా లేకుండా పోయిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రూరల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ చేపట్టిందని, వాటిని పల్లెప్రగతిలో ఉపయోగించాలన్నారు. రాష్ట్రంలోని చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని చెప్పారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సిటీకి వచ్చిన వారు తిరిగి గ్రామాలకు వెళ్లే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పుడే.. నిజమైన ప్రగతి: జీవన్ రెడ్డి
బెల్టు షాప్ లు, మద్యం నుంచి జనాలను కాపాడినపుడే నిజమైన పల్లె ప్రగతి జరిగినట్లు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. హోం, పంచాయతీ రాజ్ శాఖలు బెల్టు షాప్ ల మీద దాడులు చేయాలని కోరారు. గ్రామాల్లో బెల్టు షాప్ లను తీసివేయాలన్నారు. ప్రతి ఊరికి ట్రాక్టర్ అవసరం ఉండకపోవచ్చని, తక్కువ జనాభా ఉండే ఊర్లకు ట్రాక్టర్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
For More News..