పోలీసులకే మస్కా: నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్ గూడ జైలు నుండి ఖైదీ జంప్

హైదరాబాద్: తప్పు చేస్తే  పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని అందరూ బయపడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా జైలు అధికారులనే బురిడీ కొట్టించి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన ఏ చిన్నా జైల్లోనే జరగలేదు.. అత్యంత పటిష్ట భద్రతా ఉండే హైదరాబాద్ చంచల్‎గూడ జైల్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ సంతోశ్​నగర్‌కు చెందిన సుజాత్ అలీ ఖాన్‌ అనే యువకుడిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మొదటి కేసులో సుజాత్ అలీ ఖాన్‌‎కు రాజేంద్రనగర్ కోర్టు గతంలోనే బెయిల్ ఇచ్చింది. ఇంకో కేసులో బెయిల్ రాకపోవడంతో సుజాత్ అలీ ఖాన్‌ జైల్లో నుండి విడుదల కావడానికి వీలు కాలేదు.

 రెండో కేసులో కూడా బెయిల్ మంజూరు అయినట్లు నవంబర్ 26వ తేదీన జైలు అధికారులకు బెయిల్ పేపర్లు సమర్పించి సుజాత్ అలీ ఖాన్‌ దర్జాగా జైలు నుండి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఆన్లైన్లో రావాల్సిన బెయిల్ ఉత్తర్వులు జైలుకు చేరలేదు. ఇంతలోనే సుజాత్ అలీ ఖాన్‌‎ను కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైల్లో ఉన్న సుజాత్ అలీ ఖాన్‌‎ను కస్టడీకి తీసుకునేందుకు నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలుకు వెళ్లగా.. నిందితుడు అక్కడ లేడు. వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు సుజాత్ అలీ ఖాన్‌‎ బెయిల్ పేపర్లు తనిఖీ చేయగా షాకింగ్ విషయం బయటపడింది.

ALSO READ | లొంగిపోవాలని చెప్పిన వినలే.. ములుగు ఎన్ కౌంటర్‎పై SP శబరీష్ ప్రకటన

 రెండో కేసులో బెయిల్ వచ్చిందంటూ సుజాత్ సమర్పించిన బెయిల్ పేపర్లు నకిలీవని అధికారులు గుర్తించారు. ఫేక్ బెయిల్ పేపర్స్ సమర్పించి ఖైదీ పరార్ అయ్యాడని తెలుసుకుని జైలు అధికారులు ఖంగుతిన్నారు. జైల్లో బెయిల్ పేపర్ల విభాగంలో పని చేసే తన మిత్రుడు, సహ ఖైదీ సహయంతోనే సుజాత్ అలీ ఖాన్ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో చంచల్ గూడ జైలు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పటిష్ట్ భద్రతా ఉండే చంచల్ గూడ జైల్లో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. నకిలీ పత్రాలతో బయటికెళ్లిన ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.